రు‘బాబు’పై విస్మయం! | Chandrababu Naidu Comment On Election Commission | Sakshi
Sakshi News home page

రు‘బాబు’పై విస్మయం!

Published Sun, Apr 14 2019 8:21 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Chandrababu Naidu Comment On Election Commission - Sakshi

సాక్షి, చిత్తూరు: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సామే. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తోంది. కచ్చితత్వం కోసం ఎంత కఠిన నిర్ణయాలనైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఎన్ని రాజకీయాలు ఎదురొస్తున్నా స్వతంత్రతను కాపాడుకుంటూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతోంది. అలాంటి ఎన్నికల సంఘంపై చంద్రబాబు నాయుడు ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారు.

పెరిగిన ఓటింగ్‌ తమకే లాభమని     ఒకసారి.. ఓటింగ్‌ తగ్గించేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని మరోసారి.. ఈవీఎంలు సరిగ్గా పనిచేయనీకుండా చేసి వైఎస్సార్‌సీపీకి లాభం చేకూరేలా ఎన్నికల కమిషన్‌ ప్రయత్నిస్తోందని ఇంకో సారి మాట్లాడుతుండడంపై పలువురు మేధావులు ఆక్షేపిస్తున్నారు. పసుపు కుంకుమ ద్వారా మహిళల ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అయితే ట్రెండ్‌ మాత్రం టీడీపీకి అనుకూలంగా లేకపోవడంతో చంద్రబాబు నాయుడు పరనిందలు మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేయడం వల్లే ఘోరపరాభవం ఎదురవుతోందని టీడీపీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు.
 
మొరాయించిన ఈవీఎంలు 0.3 శాతమే
జిల్లా వ్యాప్తంగా 13వేల ఈవీఎంలు ఓటింగ్‌ కోసం ఉపయోగించారు. వీటిలో కేవలం 0.3 శాతం ఈవీఎంలు మాత్రమే మొరాయించాయని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని పదేపదే ప్రెస్‌మీట్‌లో చెప్పారు. బాబు ఆదేశంతోనే టీడీపీ నాయకులు ఎన్నికల్లో గొడవలు సృష్టించారు. కొన్నిచోట్ల దాడులకు కూడా తెగబడ్డారు. ఇవన్నీ పోలింగ్‌ను తగ్గించేందుకు చేసిన కుట్రలే. అయినా జనం దేనికీ వెరవకుండా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 80 శాతం పోలింగ్‌ నమోదు కావడమే దీనికి నిదర్శనం. ఈవీఎంలు సరిగా పనిచేయకపోతే పోలింగ్‌ ఎక్కువ శాతం ఎందుకు నమోదవుతుందని తటస్థులు ప్రశ్నిస్తున్నారు.

ఓటమి భయంతోనే డ్రామాలా?
ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని తెలిసే చంద్రబాబు నాయుడు ఈసీపై యుద్ధం అనే డ్రామాలాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పెరిగిన ఓటింగ్‌ శాతంపై విద్యావేత్తలు, మేధావులు ప్రశంసిస్తున్నారు. అయితే బాధ్యతగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎన్నికలను ఫార్సుగా చూపిస్తున్నారు. ఇది ప్రజాతీర్పును, ఎన్నికల వ్యవస్థను అవమానపరచడమే అని ప్రభుత్వ అధికారులు సైతం తేల్చి చెబుతున్నారు. అరాచక పాలనపై ఓటర్లు దండెత్తడంతోనే ఆయన ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. వైఫల్యాలను అంగీకరించి ఉంటే హుందాగా ఉండేదని వారు అంటున్నారు.

2014లో టాంపరింగ్‌తోనే గెలిచారా?
ఈవీఎంలను టాంపరింగ్‌ చేశారని చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలపై ప్రజలు భగ్గుమంటున్నారు. మరి 2014లో ఈవీఎంలను టాంపరింగ్‌ చేసి చంద్రబాబు గెలిచారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హైటెక్‌ బాబుకు ఈవీఎంల పనితీరు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. బాబు వైఖరిపై రాజకీయ వర్గాల్లోనూ తీవ్రంగా చర్చ జరుగుతోంది. ‘మన ఈవీఎంలను ఇతర దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు. వీటిల్లో తప్పు ఉంటే ఎందుకు వాడుకుంటారు’ అని వారు చర్చించుకుంటున్నారు. ప్రజలు తిరస్కరించినట్లు స్పష్టమైన ట్రెండ్‌ ఉండబట్టే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. బాబుకు బుద్ధి చెప్పడానికే ప్రజలు ఓటెత్తారని వారు చెప్పుకుంటున్నారు. 2014 కంటే జిల్లాలో దాదాపు 2 శాతం పోలింగ్‌ ఎక్కువ నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement