
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారులో తన ముద్ర కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా ఢిల్లీ హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు! తాను అనుకున్న సీట్లను సాధించడమే కాకుండా టీడీపీలో సీట్లు ఆశిస్తున్న ఒకరిద్దరిని కాంగ్రెస్‌లో చేర్పించి మరీ బీ ఫారాలు ఇప్పించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు!! బాబు ఒత్తిడి వల్లే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏమాత్రం పోటీ లేని నియోజకవర్గాల్లో సైతం పార్టీ అధిష్టానం కొందరు కాంగ్రెస్ ప్రముఖుల సీట్లను పెండింగ్‌లో పెట్టిందని తెలుస్తోంది. మరోవైపు బాబు మార్కు రాజకీయంపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు చంద్రబాబు ఆమోదం కోసమే రాహుల్ గాంధీ దూతగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఏపీ రాజధాని అమరావతిలో ఆయనతో సమావేశమయ్యారన్న ప్రచారం సోమవారం ప్రకటించిన మొదటి జాబితాతోనే తేటతెల్లమైందని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తుంటే మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు చెప్పినట్లే మంత్రివర్గం కూర్పు సహా ఇతర అంశాలు ముడిపడి ఉండేటట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.
సనత్‌నగర్, జూబ్లీహిల్స్‌పై బాబు గురి...
మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడైన మర్రి శశిధర్‌రెడ్డి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు ఆయన దరఖాస్తు కూడా చేశారు. మరెవరూ ఇక్కడి నుంచి పోటీలో లేకపోవడంతో ఆయనకు కచ్చితంగా సీటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంతో మర్రి కంగుతిన్నారు. ఓటర్ల జాబితాలో అవకవతకలకు సంబంధించి టీఆర్‌ఎస్‌పై ఒంటరి పోరాటంచేసిన తనకు మొదటి జాబితాలో సీటు దక్కకపోవడంపట్ల మర్రి శశిధర్‌రెడ్డి అవమానంగా భావిస్తున్నారు. అయితే సనత్‌నగర్ సీటును టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ నేత కూన వెంకటేశ్‌గౌడ్ ఈ సీటు తనకే దక్కుతుందన్న ధీమాతో ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు.
చంద్రబాబు హామీ మేరకు తాను ప్రచారం చేసుకుంటున్నట్లు ఆయన చెబుతున్నారు. దీంతో ఇప్పుడు శశిధర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో టికెట్ దక్కడం అనుమానంగానే ఉంది. అలాగే జూబ్లీహిల్స్ నియోజకరవ్గం నుంచి తనకు టికెట్ వస్తుందని ఆశించిన సీఎల్పీ మాజీ నేత పీజేఆర్ తనయుడు విష్ణవర్ధన్‌రెడ్డి మొదటి జాబితా చూసి కంగుతిన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడానికి ఎలాంటి కారణాలు లేవని, ఎందుకు పెండింగ్‌లో పెట్టారో తెలియదని ఆయన అన్నారు. అయితే మాగంటి గోపీనాథ్ (టీఆర్‌ఎస్ అభ్యర్థి)ని ఓడించడానికి అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తే బాగుంటుందని చంద్రబాబు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎల్బీ నగర్, పటాన్‌చెరు కూడా...
శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన వెంటనే రెండు నెలల క్రితమే ప్రచారం ప్రారంభించి ఇప్పటికే ఓ దశ ప్రచారాన్ని పూర్తి చేసిన ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సామ రంగారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. రంగారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుని బీ ఫారం ఇవ్వాలన్న చంద్రబాబు సూచనతోనే ఎల్బీ నగర్ సీటును కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. పొత్తు పెట్టుకున్న పార్టీలో టీడీపీ నేతలను చేర్చించి బీ ఫారం ఇప్పించడం బాబుకు కొత్తేమీ కాదు. ఏపీ ఎన్నికల సందర్భంగా 2014లో టీడీపీకి చెందిన కామినేని శ్రీనివాస్‌ను బీజేపీలో చేర్పించి ఆ పార్టీ బీ ఫారం ఇప్పించడమే కాకుండా బీజేపీ తరఫున మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు.
మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకరవ్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నా ఆ సీటును టీడీపీకి కేటాయించాలని చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న కాట శ్రీనివాసగౌడ్‌కు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ తీవ్ర స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే ఇక్కడి నుంచి కొలను బాల్‌రెడ్డికి టికెట్ ఇప్పించాలన్న విజయశాంతి ప్రయత్నాలను కూడా పార్టీ పట్టించుకోలేదు. ఈ సీటును చంద్రబాబు డిమాండ్ చేయడమే ఇందుకు కారణమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కూటమి అధికారంలోకి వస్తే...
తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు హవా ఎక్కువగా నడిచే అవకాశం కనిపిస్తోందంటూ కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈలోపే టీఆర్‌ఎస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయన్నది పార్టీ సీనియర్ నేతల అభిప్రాయంగా ఉంది. టీడీపీతో పొత్తుకన్నా నేరుగా టీఆర్‌ఎస్‌తో తలపడితే కాంగ్రెస్ విజయవకాశాలు మెరుగుపడేవని కూడా వారంటున్నారు. చంద్రబాబు సూచనతో ఇప్పుడు అభ్యర్థుల జాబితాలో మార్పులకు అవకాశం ఇచ్చినట్లే భవిష్యత్తులో మంత్రివర్గం కూర్పుకు కూడా అవకాశం ఉంటుందేమోనని ఓ మాజీ ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment