
జిల్లా మంత్రిపై రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్రుగా ఉన్నారా... ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా... మళ్లీ టికెట్టిస్తే గెలుస్తారన్న నమ్మకం సన్నగిల్లుతోందా... ఆయన్ను మార్చాలన్న ఆలోచనలో అధినేత ఉన్నారా... తాజా పరిణామాలు చూస్తే ఇవన్నింటికీ ఔననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురైదుగురకు మినహా... మిగిలిన వారికి మొండిచెయ్యి చూపనున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఆ నలుగురైదుగురిలో మన రాజుగారు లేరంట. పదవికోసం పార్టీ ఫిరాయించి... తీరా అక్కడ టికెట్టు దక్కక పోతే... ఎంతటి అవమానం?
సాక్షిప్రతినిధి విజయనగరం : అవసరం మేరకు వాడుకుని ఎవ్వరినైనా యూజ్ అండ్ త్రోలా విసిరేయగల సమర్థుడు చంద్రబాబు. టికెట్టిచ్చి గెలిపించిన పార్టీకి ఎగనామం పెట్టి... కేవలం మంత్రి పదవికోసమే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఆయన షాక్ ఇస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 21మంది ఎమ్మెల్యేల్లో నలుగురైదుగురికి మాత్రమే మళ్లీ అవకాశం ఇవ్వాలనుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. అందువల్ల పార్టీ ఫిరాయించి మంత్రి అయిన సుజయ్ కృష్ణరంగారావు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సుజయ్‌కు సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత భారీగా పెరగడంతో పాటు సొంత ఇంటిలో వేరు కుంపట్లు చేటు తెచ్చేలా ఉన్నాయి.
పార్టీలో వ్యతిరేకత
వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది 2016 ఏప్రిల్‌లో ప్రతిపక్షాన్ని వదిలి అధికార పక్షం చెంతకు చేరారు సుజయ్‌కృష్ణ రంగారావు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2017 ఏప్రిల్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కూడా అయ్యారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని, మంత్రి పదవి రాగానేఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాననీ చెప్పిన సుజయ్‌పై అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మొదలైంది. మంత్రి పదవి కోసమే పార్టీని వదలి వెళ్లారని గుర్తించిన ప్రజల్లో ఆయనపై నమ్మకం సడలుతోంది. మరోవైపు అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత వస్తే చిత్రంగా పార్టీలో మాత్రం సుజయ్‌పై వ్యతిరేకత మొదలైంది. కొన్నేళ్లుగా సుజయ్‌ను సీఎం అనేక సార్లు హెచ్చరించడం కూడా జరిగింది. కనీసం నియోజకవర్గంలో పార్టీ సమావేశాలు కూడా నిర్వహించకపోవడంపై చంద్రబాబు స్వయంగా అసంతప్తి వ్యక్తం చేశారు.
కేడర్‌లో అసంతృప్తి
కనీసం టీడీపీలోనైనా సుజయ్‌కు గౌరవం దక్కిందా అంటే అదీ లేదు. పార్టీ కార్యక్రమాల్లో సుజయ్‌పై బహిరంగంగానే నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిని బయటపెట్టారు. పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు సుజయ్ సమావేశంలోనే చొక్కా చించుకుని నిరసన తెలిపారు. ఓ గ్రామ పర్యటనకు వెళితే స్థానికులు మంత్రిని గో బ్యాక్ అన్నారు. మంత్రి నాయకత్వాన్ని కాదని ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఒక సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్ళి పోయారు. ఇలాంటి అవమానాలు సుజయ్‌కు సర్వసాధారణమైపోయాయి. తెంటు లకు‡్ష్మనాయుడు, తూముల భాస్కరరావు వంటి నాయకులు సైతం సుజయ్‌పై తమకున్న వ్యతిరేకతను ఆయా సందర్భాల్లో బయటపెట్టారు.
గ్రూపుల గోల
రాజులు తెలుగు దేశంలోకి రాకముందు రెండేసి గ్రూపులుండేవి. గ్రామాల్లో రెండు గ్రూపులు వద్దనీ తాను అందర్నీ చూస్తాననీ వారిని టీడీపీ 1(పాతవాళ్లు), టీడీపీ 2(వైఎస్సార్ సీపీకి చెందిన వారు)అని రెండు వర్గాలుగా సుజయ్ విడదీశారు. తనకు సన్నిహితంగా ఉన్న కొద్దిమందినే దగ్గరకు తీసుకుంటున్న మంత్రి రంగారావు తీరుతో గ్రామాల్లో చిచ్చు రేగింది. రానున్న ఎన్నికల ముందే తాము ఏదో ఒకటి తేల్చుకుంటామని కలసి ఉండలేని రెండు గ్రూపుల వారు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. బలిజిపేటలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభానికి వెళ్లిన సుజయ్ సమక్షంలోనే టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.
ప్రజల్లో తగ్గిన గ్రాఫ్
పోనీ జనానికేమైనా చేశారా అంటే అదీలేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం బొబ్బిలి వంశానికి చెందిన రాజు సుజయ్ కృష్ణ రంగారావుకు ప్రజలు ఎంతగానో అభిమానించారు. కానీ మంత్రి పదవి కోసం ఆశపడి టీడీపీలోకి వెళ్ళి సుజయ్ చేతులారా జనం వద్ద చులకనైపోయారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పుకుంటున్న ఆయన తన నియోజక వర్గాన్ని కాదు కదా కనీసం తాను నివసిస్తున్న బొబ్బిలి పట్టణాన్ని కూడా పట్టించుకోలేదు. ఇటీవల హడావుడిగా అభివృద్ధి పనులకు శంకుస్తాపనలు చేసేశారు. అవేవీ పూర్తికావని ఆయనకూ తెలుసు.
కుటుంబంలో కుంపటి
సుజయ్‌కు ఇంటా బయటా ప్రతికూలంగా ఉంది. సొంత తమ్ముడు ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) రూపంలో కుంపటి రాజుకుంది. ఇద్దరు అన్నదమ్ముల వివాదాన్ని సుజయ్ తమ్ముడు, బేబీ నాయన అన్న రామ్‌నాయన వద్దకు, తల్లి వద్దకు కూడా తీసుకువెళ్లారు. ప్రారంభంలో సుజయ్‌కృష్ణ డెయిరీఫారం నిర్వహిస్తుండేవారు. అప్పట్లోనే బేబీనాయన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. రామ్ నాయనకు రాజకీయాలపై ఆసక్తి లేదు. అప్పట్లో రాజకీయ అవకాశం రావడంతో వయసు రీత్యా బేబీ నాయన చిన్నవాడు కావడంతో సుజయ్‌ను రంగంలోకి దించారు. కానీ ఈసారి బేబీనాయనకు రాజకీయ పదవిపై కోరిక బలంగా ఉంది. దీంతో అన్నను పక్కకు తప్పుకోవాల్సిందిగా పంచాయతీలు చేస్తున్నారు. చివరికి అన్నదమ్ములిద్దరూ వేరు వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి టిక్కెట్టు సుజయ్‌కు రావడం దాదాపుగా లేనట్టేనని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment