
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న చింతమనేని మరోసారి తన మార్కు ఓవరాక్షన్ చేశారు. మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ వద్ద తన వాహనాన్ని ఆపిన సిబ్బందిపై చింతమనేని దూషణకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. కారుకు నెంబర్ ప్లేట్, ఎమ్మెల్యే పాస్ లేకుండా టోల్‌గేట్ నుంచి వెళ్లేందుకు చింతమనేని ప్రయత్నించారు. దీంతో టోల్‌గేట్ సిబ్బంది చింతమనేని కారును అడ్డుకున్నారు. కనీసం ఎమ్మెల్యే స్టికర్ కూడా లేకపోవడంతో వారు వాహనాన్ని నిలిపివేశారు. దీంతో చింతమనేని తనకు అలవాటైన రితీలో టోల్‌గేట్ సిబ్బందిని దూషించారు. అయిన కూడా సిబ్బంది వెనక్కి తగ్గకపోవడంతో.. చింతమనేని కారు అక్కడే వదిలివేసి బస్సులో వెళ్లిపోయారు. టోల్‌గేట్ వద్ద వీఐపీ వాహనాలు వెళ్లే మార్గంలో వాహనాన్ని విడిచి వెళ్లారు.
చింతమనేని వ్యవహరంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం నంబర్ ప్లేట్ లేకుండా, కారు పాస్ లేకుండా కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే రాసి ఉండంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చింతమనేనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ.. తన కారును అక్కడి నుంచి ఎలా తెప్పించుకోవాలో తెలుసంటూ చింతమనేని వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment