
సాక్షి, తిరుపతి: ‘వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేశారు. బీజేపీ అబద్ధం ఆడుతోంది. హోదా ఇస్తామన్న హామీ వారి మేనిఫెస్టోలోనే ఉంది... ఈ రోజు బుకాయిస్తున్నారు’ అని సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంపైన, బీజేపీ నేతలపైనా ధ్వజమెత్తారు. తిరుపతి తారకరామా స్టేడియంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభలో చంద్రబాబునాయుడు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా 2014 ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికల బహిరంగ సభలో నరేంద్రమోదీ ఇచ్చిన హామీల ప్రసంగం వీడియోను సభలో ప్రదర్శించారు. నాడు మోడీ ప్రత్యేకహోదా హామీ ఇవ్వలేదని బీజేపీ వారు వాదించడం ఎంత వరకు న్యాయం అన్నారు.
ఢిల్లీలో ఉండే ప్రధాని ఉలిక్కిపడి లేచేలా ఈ సభ పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హెచ్చరించారు. తాను ప్రధానిపైనా, కేంద్రంపై పోరాడుతుంటే... కలిసి రావాల్సింది పోయి కొందరు తనను విమర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ మాట్లాడని పవన్ కల్యాణ్ కూడా తనను విమర్శిస్తున్నారన్నారు. వీళ్లను చూస్తుంటే నరేంద్రమోదీపై ఈగ వాలనివ్వకుండా ప్రయత్నిస్తున్నట్లుందని ఆరోపించారు. తాను అన్నిటికీ సిద్ధపడి ఉన్నానన్నారు. టీడీపీకి ఎవరిపైనా కోపం లేదని, పొట్టకొట్టినప్పుడు తిరగబడుతామని హెచ్చరించారు. ఢిల్లీ కూడా చిన్నబోయే విధంగా రాజధానిని నిర్మిస్తానని చెప్పి మాట తప్పిన ప్రధానిని ఏమనాలని ప్రశ్నించారు.
విభజన చట్టానికే దిక్కులేదా
విభజన సమయంలో చేసిన చట్టానికి దిక్కులేదంటే ఎవరికి చెప్పుకోవాలన్నారు. ప్రత్యేక హోదా ఆశచూపి పార్లమెంట్‌లో విభజన బిల్లుపెట్టి మమ అనిపించారని వెళ్లడించారు. తెలంగాణా డిస్కం నుంచి డబ్బులు రావాలని, అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి ఇద్దరు ప్రధానులను ఎంపిక చేసినా... ఏనాడు స్వార్థం కోసం పనిచేయలేదన్నారు. ప్రస్తుతం దేశంలో ఏటీఎంలు ఖాలీగా ఉన్నాయని, బ్యాంకుల్లో డబ్బులు దొరకటం లేదన్నారు. విజయమాల్యా లాంటి వారు విదేశాలకు పారిపోయే పరిస్థితి ఉందన్నారు.
గుజరాత్‌లో అనేక నగరాలున్నాయి... మాకొక నగరం వద్దా
గుజరాత్‌లో అనేక నగరాలున్నాయని, అటువంటి నగరం తమకు అవసరం లేదా? అని ప్రశ్నించారు. అనుభవం ఉందనే ఉద్దేశంతో ప్రజలు తనను గెలిపించారని... హైదరబాద్ తరహాలో అభివృద్ధి చేస్తామని జనం నమ్మారని తెలిపారు. అందరూ సహకరించకపోయినా దేశంలోనే నంబర్ 1గా అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. రైతులకు 10శాతం వడ్డీతో సహా రుణమాఫీ చేసినట్లు చెప్పుకొచ్చారు. అదే విధంగా డ్వాక్రా మహిళలకు రూ.10వేల చొప్పున చెల్లించినట్లు వెళ్లడించారు.
జూన్‌లో నిరుద్యోగ భృతి
వచ్చే జూన్ నెల నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా 200 కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రూ.16 లక్షల కోట్లతో 20 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. కరువు జిల్లా అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తున్నట్లు వెళ్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు, తదితరులు ప్రసంగించారు.