రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేసేందుకే సింగపూర్‌ వెళ్లా | CM Chandrababu comments on Singapore tour | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేసేందుకే సింగపూర్‌ వెళ్లా

Published Thu, Jul 12 2018 3:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

CM Chandrababu comments on Singapore tour - Sakshi

అన్న క్యాంటీన్‌లో మహిళకు భోజనాన్ని అందిస్తున్న సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: తాను సింగపూర్‌ వెళితే విహారానికని విమర్శిస్తున్నారని, అయితే తాను రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు, నెట్‌వర్కింగ్‌ కోసం వెళ్లానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మూడు రోజులపాటు సింగపూర్‌లో మూడు సమావేశాల్లో పాల్గొన్నానని, పలు కార్యక్రమాలకు హాజరయ్యానని చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రం రెండోసారి దేశంలోనే మొదటిస్థానంలో నిలవడం తమ ప్రభుత్వ పనితనాన్ని తెలుపుతోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం బాగుందంటే ప్రతి ఒక్కరూ ఏపీ గురించి చెబుతున్నారని, అన్ని సెక్టార్లలోనూ మొదటిస్థానంలో ఉన్నామని చెప్పారు.

విద్య, వైద్యం, ఐటీ, హార్డ్‌వేర్‌ తదితర అన్నింటిలోనూ నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నామన్నారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టించడం వల్లే మూడు భాగస్వామ్య సదస్సుల్లో 2,738 ఒప్పందాలు చేసుకున్నామని, వాటి విలువ రూ.16,04,450 కోట్లని చెప్పారు. అందులో 1,529 ఒప్పందాలకు సంబంధించి రూ.5,79,715 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటిద్వారా 9.35 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. తమ హయాంలో దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐగా అనంతపురంలో కియా మోటార్స్‌ వచ్చిందని, జనవరిలో అక్కడ తయారైన కారు రోడ్డు మీదకు వస్తుందని చెప్పారు. ఇన్ని జరుగుతుంటే వైఎస్సార్‌సీపీ తమపై అవినీతి ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తమది ప్రపంచంలోనే నీతివంతమైన పాలన అని చెప్పుకొచ్చారు. గోదావరి నీటిని కృష్ణాకు తీసుకురావడం వల్లే ఈరోజు ఇక్కడివాళ్లు నీళ్లు తాగుతున్నారని అంటూ.. ఆ నీళ్లు తాగినప్పుడైనా తాను గుర్తుకురావాలని(జర్నలిస్టులనుద్దేశించి) వ్యాఖ్యానించారు. తన గురించి ఏవేవో రాస్తున్నారని, అలాగాక జరుగుతున్న పనుల్ని విశ్లేషించాలని కోరారు.

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది యూపీఏయే..
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమేనని సీఎం అన్నారు. యూపీఏ సర్కారు చివరి కేబినెట్‌ సమావేశంలో దీన్ని ప్రకటించారని, దీనిని చట్టంలోనూ వారే పెట్టారని చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం కాబట్టి ఎంత ఖర్చయితే అంత తామే పెట్టుకుంటామని కూడా చెప్పారని, అంతేగాక 2011–12 అంచనాల ప్రకారం కాకుండా 2013–2014 అంచనాల ప్రకారం ఖర్చు చేస్తామన్నారని తెలిపారు. 2013లో తీసుకొచ్చిన భూసేకరణ బిల్లు ప్రకారం భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌లో పెరుగుదల ఉంటుంది కాబట్టి దాన్ని కూడా భరిస్తామని యూపీఏ సర్కారు చెప్పిందని, ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం పెట్టిన ఖర్చును దాని వాటాగా చూపి మిగిలిన ఖర్చంతా తామే భరిస్తామని ఆరోజే కేబినెట్‌లో చెప్పిందన్నారు. బీజేపీ వచ్చాక నీతి ఆయోగ్‌ చెబితే నిర్మాణ బాధ్యతను రాష్ట్రప్రభుత్వానికి అప్పగించారన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌లో పెరుగుదల రూ.3వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లు ఉందని ఆయన చెప్పారు.

అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం
పేదవాడు ఆకలి బాధతో ఉండకూడదన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. విజయవాడ భవానీపురం 28వ డివిజన్‌లో నిర్మించిన అన్న క్యాంటీన్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. అక్కడి మహిళలతో కలసి భోజనం చేశారు. అనంతరం విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో అన్న క్యాంటీన్ల ప్రారంభ సభలో మాట్లాడారు. రెస్టారెంట్ల స్థాయిలో అన్న క్యాంటీన్లలో రూ.5కే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.100 క్యాంటీన్లను ప్రారంభించామని, ఆగస్టు 15 నాటికి 203 క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. క్యాంటీన్లకు ఆహారాన్ని సరఫరా చేసే బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించామని, తిరుమల అన్నదాన కార్యక్రమ తరహాలో వీటికి విరాళాలు ప్రకటించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement