కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పుకోసం జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో చేరే పార్టీలు, ఆ పార్టీ అధినేతలతో దశలవారీగా భేటీ కావడానికి ఇప్పటికే సీఎం రూట్‌మ్యాప్ రూపొందించుకున్నారు. అయితే, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, జాతీయస్థాయిలోని పలు పరిణామాలతో ఫ్రంట్ కార్యకలాపాలను కొంతకాలం నెమ్మదిగా నడిపించాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ నెలాఖరులో నిర్వహించాల్సిన టీఆర్‌ఎస్ ప్లీనరీపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ట్రెండ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ‘‘కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎంతో కొంత ఉంటుంది. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు జనతాదళ్(ఎస్) పోటీపడుతున్నాయి.
ఆ రాష్ట్రంలో పూర్తిగా రెండు జాతీయ పార్టీల ఆధిపత్యమే ఉంటుందా? ప్రాంతీయ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందా అనేది మాకు ఆసక్తి కలిగించే అంశమే. ప్రాంతీయ పార్టీకి కర్ణాటక ప్రజలు పట్టం కడతారా? జాతీయ పార్టీల వైపే మొగ్గు చూపుతారా? అనేది గమనిస్తున్నాం. ఈ ఫలితాలు వచ్చే దాకా వేచి చూస్తాం. ఫలితాలు వచ్చేదాకా ఫెడరల్ ఫ్రంట్ కార్యకలాపాల్లో వేగం తగ్గించాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు’’అని టీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు.
ఒడిశా పర్యటన వాయిదా?
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒడిశాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు గతంలో వెల్లడించాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భువనేశ్వర్‌లో ఈ వారంలోనే భేటీ అయ్యేందుకు వెళ్తారని సీఎం కార్యాలయ వర్గాలు చెప్పాయి. అయితే కూటమి కార్యకలాపాలపై నెమ్మదిగా వెళ్లాలన్న నిర్ణయంలో భాగంగా కేసీఆర్ పర్యటన వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఒడిశా పర్యటన ఎప్పుడు ఉంటుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు.
అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు పర్యటన ఉండకపోవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వంటివారితోనూ సమావేశమవుతారని పార్టీ వర్గాలు గతంలో వెల్లడించినా.. ఇప్పుడా ప్రస్తావన తేవడం లేదు. దేశంలోని మిగిలిన ప్రాంతీయ పార్టీల ముఖ్యులతోనూ ఇప్పట్లో సమావేశాలు ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జాతీయస్థాయి నేతల్లేకుండానే ప్లీనరీ
టీఆర్‌ఎస్ ప్లీనరీ ఈ నెల 27న కొంపల్లిలోని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సుమారు 15 వేల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భావానికి ఈ ప్లీనరీని వేదికగా చేసుకుంటారని పార్టీ వర్గాలు ముందుగా వెల్లడించాయి. అయితే ప్లీనరీని పార్టీ వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ నిర్వహించబోయే సభను రాజకీయ ప్రయోజనం లేకుండా నిర్వహించడానికి కేసీఆర్ విముఖత వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద సభ నిర్వహించినా, ఆ సభ ఊపును ఏడాదిపాటు కొనసాగించడం సాధ్యం కాదని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా ఎన్నికల సమరశంఖాన్ని పూరించినట్టుగా ఉంటుందనే అంచనాతో ఉన్నారు. దీంతో పార్టీ 17వ ప్లీనరీని పార్టీ ప్రతినిధులతో సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment