సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా? ముందస్తు ఎన్నికల కోసం రేపే తెలంగాణ అసెంబ్లీని సీఎం కే చంద్రశేఖరరావు రద్దు చేయబోతున్నారా? అసెంబ్లీ రద్దు తీర్మానానికి ముందు రాష్ట్ర మంత్రిమండలి భేటీ అవుతుందా? అంటే ఇప్పటివరకు లభిస్తున్న సంకేతాలు, తాజా రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. గురువారం తెలంగాణ అసెంబ్లీ రద్దు కాబోతోంది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి.
గురువారం ఉదయం రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు వర్గాల ప్రజలకు వరాలు ప్రకటించడంతోపాటు.. అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ సిఫారసు చేస్తారని భావిస్తున్నారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం నుంచి సమావేశాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఫాంహౌజ్ నుంచి ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం మొదట ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో ముచ్చటించారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జోషి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులతో సమావేశమై చర్చలు జరిపారు. అసెంబ్లీ రద్దు తర్వాత డిసెంబర్‌లోనే ముందస్తు ఎన్నికలు జరిగేందుకు వీలుగా.. తీసుకోవాల్సిన పకడ్బందీ చర్యలపై ఆయన ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. రేపటి కేబినెట్ ఎజెండా, అసెంబ్లీ రద్దు తర్వాత పరిణామాలపైనా చర్చించినట్టు తెలుస్తోంది. గురువారం కేబినెట్ ఎప్పుడు భేటీ కానుందో.. మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ జీవో జారీచేసింది. జనవరి 1, 2018 నుంచి ఈ డీఏ పెంపు వర్తించనుంది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కూడా ముందస్తు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment