టీఆర్‌ఎస్‌ నేతల తీరుపై కేసీఆర్‌ సీరియస్‌ | cm kcr serious on karimnagar party leaders | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ నేతల తీరుపై కేసీఆర్‌ సీరియస్‌

Published Fri, Dec 15 2017 9:05 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

cm kcr serious on karimnagar party leaders  - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించారు. సాధారణ ఎన్నికలు మరో ఏడాదిన్నరలో జరిగే అవకాశం ఉండగా.. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న అంతర్గత విభేదాలపై ఆయన సీరియస్‌గా ఉన్నారు. పొరుగు జిల్లా నిజామాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్సీ డాక్టర్‌ ఆర్‌.భూపతిరెడ్డిని దాదాపుగా పార్టీ నుంచే తప్పించే పరిస్థితి ఏర్పడింది. ఆ జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కరీంనగర్‌ జెడ్పీచైర్‌పర్సన్‌ తుల ఉమ కూడా ఈ నిర్ణయంలో కీలకంగా ఉన్నారు.

‘తెలంగాణ ఉద్యమం.. రాష్ట్రం ఏర్పాటు చారిత్రాత్మకమో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కూడా అంతే ముఖ్యం.. వీటిని దృష్టిలో పెట్టుకొని అన్ని స్థాయిల్లో పార్టీ కేడర్, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చేపట్టిన యజ్ఞంలో అంకితభావంతో పాల్గొనాలి’ అంటూ టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పదే పదే ఉద్భోద చేస్తున్నారు. అయితే.. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన, చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పక్కన బెడితే అనూహ్యంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పదవులు అనభవిస్తున్న వారే అసంతృప్తికి గురవుతుండటం అధినేతకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని క్రమశిక్షణ పథంలో నడిపించేందుకు నడుం కట్టిన అధినేత నియమ నిబంధనలను ఉల్లంఘించి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకునేందుకు నియోజకవర్గాల వారీగా నివేదికల తయారీకి సిద్ధం కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

మంథని నుంచి కోరుట్ల వరకు.. నియోజకవర్గాల వారిగా నివేదికలు..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై నివేదికలు సిద్ధం అవుతున్నాయి. ఇదివరకే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై మూడు విడతలుగా స్వయంగా సర్వే చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాస్తవ పరిస్థితులను వారి కళ్లకు కట్టారు. ప్రభుత్వ పథకాలు బాగానే అమలవుతున్నా.. ప్రజాప్రతినిధుల తీరుపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని ఆయన మీటింగ్‌ పెట్టి మరీ సూచనలు చేశారు. తాజాగా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మంథని నియోజకవర్గం మొదలుకుని కోరుట్ల వరకు నియోజకవర్గాల వారీగా అన్ని కోణాలను స్పృశిస్తూ సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఇంటలిజెన్స్‌ను ఆదేశించినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ సంతృప్తి, అసంతృప్తి వాదుల జాబితాను కూడా అందులో పొందుపరచనున్నారని సమాచారం.

పెద్దపల్లి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య కొరవడిన సమన్వయం.. జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో తారాస్థాయికి చేరుకుంటున్న గ్రూపుల పోరుపైనా సీఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది. వారం రోజుల కిందటే ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారన్న ప్రచారం జరగ్గా, అది కాస్త వాయిదా పడింది. అయితే.. 13 నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర నివేదికలు ఇంటలిజెన్స్‌ నుంచే అందేలోపే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి జనరల్‌ సెక్రెటరీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో త్వరలోనే సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పార్టీకి చేటు కలిగిస్తే వేటే.. ఇరుకున పెట్టేవారికి ఇది హెచ్చరిక..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమంపై సీరియస్‌గా కృషి చేస్తూనే.. మరోవైపు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల నుంచే పాలన, పార్టీలపై నిశిత పరిశీలన చేస్తున్న ఆయన.. సాధారణ ఎన్నికలు మరో ఏడాదిన్నరలో రానున్న నేపథ్యంలో మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టే దిశలో అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఒక ఎత్తైతే.. ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో పార్టీ శ్రేణుల వ్యవహారశైలి కీలకమని అధినేత భావిస్తున్నారు. అందుకే.. ప్రతీసారి పార్టీ అధినేత ప్రజలే తమకు హైకమాండ్‌ అని, ఎవరి విమర్శలు తమకు అవసరం లేదని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో పూర్వ కరీంనగర్‌ జిల్లాలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య ఏర్పడిన అంతరాలపై అధినేత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో నేతల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడుతుండటంతోపాటు జిల్లాలో రెండు రోజుల పరిణామాలపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటివరకు చాపకింద నీరులా ఉన్న ఈ విభేదాలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోజురోజుకూ బహిర్గతమవుతున్నాయి. జిల్లాలో పార్టీ పటిష్టతను పక్కనబెట్టి నేతలు తలోదారి అన్నట్లు వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు అయోమయం వ్యక్తం చేస్తున్నారు. పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల మధ్యే పొసగకపోవడంతో తమను ఎవరు పట్టించుకుంటారని ఆవేదన కూడా వ్యక్తం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement