
ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్
మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. చాలామంది అవి నెరవేరకముందే చనిపోతారు.. నాకూ సిద్దిపేట జిల్లా కావాలనే ఆశ ఉండేది. చివరకు పోరాడి సాధించుకున్న తెలంగాణకు నేను సీఎం కావడం, నా సంతకంతోనే జిల్లా ఆవిర్భవించడం నా పూర్వజన్మ సుకృతం. నా జన్మ ధన్యమైంది. – సీఎం కె.చంద్రశేఖరరావు
సాక్షి, సిద్దిపేట: ‘నాకు సిద్దిపేటను జిల్లా చేయాలనే ఆశ ఉండేది. 1982లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కరీంనగర్ వెళ్తుండగా.. సిద్దిపేటలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆపి దరఖాస్తు కూడా ఇచ్చాం. పరిస్థితుల ప్రభావం వల్ల ఆయనతో పాటు ఇతర ముఖ్యమంత్రులు కూడా జిల్లా ఏర్పాటు చేయలేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు నేను ముఖ్యమంత్రి కావడం, నా సంతకంతో సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటుచేయడమే కాకుండా కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలకు నేనే భూమి పూజలు చేయడం నా పూర్వజన్మ సుకృతం. నా కోరిక నెరవేరింది. నా జన్మ ధన్యమైంది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లాగా ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా దుద్దెడలో నిర్మించనున్న కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలకు, ఎన్సాన్‌పల్లిలో నిర్మించనున్న మెడికల్ కళాశాల భవనానికి బుధవారం సీఎం భూమి పూజలు చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. నాకు జన్మనిచ్చింది, రాజకీయ ఓనమాలు నేర్పింది, మంచి గళంతో పాటు పదవులు ఇచ్చింది సిద్దిపేట అని సీఎం అన్నారు. తెలంగాణ కోసం పోరాడే ఆత్మస్తైర్యాన్ని సైతం సిద్దిపేటేఇచ్చిందని చెప్పారు. అందుకే ఇక్కడి ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని అన్నారు.
దేశంలో ఉమ్మడి ఏపీ, పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లో విభజన జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో మృత్యుంజయ శర్మ, ఇతర ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలు, అక్షర జ్ఞానంతోనే ఇంతటి వాడిని అయ్యానని, తాను ఈ మట్టిలో మొలిచిన మొక్కనేనని తెలిపారు. సిద్దిపేట డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో చదివానని, అక్కడి అధ్యాపకుల దీవెనలతోనే ఇంతటి వాడిని అయ్యానన్నారు. ఇంటర్ చదివే రోజుల్లో ముల్కి సర్టిఫికెట్ కోసం సంగారెడ్డి వెళ్లానని, అక్కడ పడిన ఇబ్బందులు చూసి సిద్దిపేట జిల్లాగా మారితే బాగుండేదన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్ర కావడంతో పాటు శరవేగంగా పట్టణం అభివృద్ధి చెందుతోందన్నారు. రైల్వే లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రాష్ట్రంలో సిద్దిపేట పెద్ద వాణిజ్య కేంద్రంగా రూపొందుతోందని చెప్పారు. రంగనాయక సాగర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు.
జిల్లా అభివృద్ధి కోసం ఎప్పుడు ఏమి అడిగినా వెంటనే చేస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట మట్టిలో ఏదో మహత్యం ఉందని, ఇక్కడ పుట్టినవారంతా రాష్ట్రాభివృద్ధిలో ముందుంటున్నారని తెలిపారు. దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్, నియోజకవర్గ కేంద్రాలను సైతం అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం ఎస్టిమేట్ వేసి ఇస్తే నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రాష్ట్ర ఉన్నతాధికారులు స్మితా సభర్వాల్, వాకాటి కరుణ, కలెక్టర్ వెంకట్రామిరెడి, డీఐజీ అనురాగ శర్మ, ఐజీ స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ కమిషనర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం చూపిన బాటలోనే నడుస్తున్నాం
భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
‘సిద్దిపేట ప్రజలకు సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చూపిన బాటలోనే నడుస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం’ అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 25 ఏళ్ల క్రితం కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట ప్రజలకు తాగునీరు ఇచ్చారని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అదేవిధంగా నాడు మొక్కలు నాటి.. హరిత సిద్దిపేటగా మార్చారని, దానికి ఆదర్శంగా తీసుకొని హరిత తెలంగాణకు సీఎం శ్రీకారం చుట్టారని కొనియాడారు. సీఎం ఇచ్చిన స్ఫూర్తితోనే కోమటిచెరువును సుందరంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. బైపాస్ రోడ్డు ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధిలో తనతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులు సమష్టిగా పనిచేస్తున్నామని, అంతా ఒకే కుటుంబ సభ్యులుగా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. జిల్లాలో విలీనమైన చేర్యాల, మద్దూరు, హుస్నాబాద్ ప్రాంతాలు అభివృద్ధిలో వెనకబడి ఉన్నాయని వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా సీఎంను మంత్రి కోరారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
హరీశ్ ఈ మధ్య హుషార్ అయ్యిండు
‘మీ ఎమ్మెల్యే, భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ మధ్య హుషారు అయ్యిండు’ అని సీఎం కేసీఆర్ సభలో చమత్కరించారు. ‘ముందు జిల్లా కావాలన్నాడు.. ఇప్పుడు కార్యాలయాలకు శంకుస్థాపన చేయమన్నాడు. అభివృద్ధిలో జిల్లాను ముందుంచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు’ అని మంత్రిని అభినందించారు. కోమటిచెరువు అభివృద్ధికి అదనంగా రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment