హరీశ్ రావుకు నా సంపూర్ణ ఆశీస్సులున్నాయి: కేసీఆర్
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు తన ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రారంభించిన అనంతరం అంబేద్కర్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన హరీశ్‌రావుతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆద్యంతం హరీశ్‌రావును పొగడ్తల్లో ముంచెత్తారు. సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి వెళ్లేటప్పుడు రెండు కళ్లలో నీళ్లు తిరిగాయని.. ఈ ప్రాంతం ఏమైపోతుందో అని తాను బాధపడ్డానని, కానీ హరీశ్ రావు కూడా తనకు దీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సిద్దిపేటను స్వర్గసీమ చేస్తున్నారని కితాబిచ్చారు. హరీశ్ కోరినట్లుగా సిద్దిపేట ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వందకోట్ల రూపాయల ఆర్థిక సాయంతో పాటు, ఇక్కడకు ప్రభుత్వ వైద్యకళాశాలను కూడా అందిస్తామని చెప్పారు.
30 ఏళ్ల క్రితం నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇదే రోడ్డు మీదుగా కరీంనగర్ వెళ్తుంటే, అంబేద్కర్ విగ్రహం వద్ద ఆపి, దండ వేయించి, సిద్దిపేట
జిల్లా ఏర్పాటుచేయాలని దరఖాస్తు ఇచ్చానని, కానీ అప్పట్లో జిల్లా ఏర్పాటుకాలేదు గానీ, ఇప్పుడు కొత్తగా జిల్లా ఏర్పాటుకావడం, దాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించే అదృష్టం కలగడం దేవుడిచ్చిన వరమని అన్నారు. తాను ఇక్కడి ప్రజల చేతుల్లో పెరిగిన బిడ్డనని, ఈ నియోజకవర్గంలో తాను తిరగని గ్రామం అంటూ లేదని చెప్పారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని, అందుకే తాను ఎక్కడ ఏం చేసినా ముందు సిద్దిపేటకే చేస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటుకావాలని ఆయన అన్నారు. ఇక్కడ అద్భుతమైన భవనాలు వస్తాయని.. పట్టణానికి నాలుగు మూలలా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, కోర్టుల సముదాయం, జడ్పీ భవనం వచ్చేలా కట్టాలని హరీశ్ రావుకు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో అందరూ సంతోషంగా బతకాలని, కొందరు మాత్రమే పెత్తనం చెలాయించే విధానం పోవాలని తెలిపారు. ప్రజల గడప వద్దకు పరిపాలన వెళ్లాలన్నారు. తెలంగాణలో 31 జిల్లాలు అయ్యాయి, 68 రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయని, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని 31 మంది కలెక్టర్లు, 68 మంది ఆర్డీవోలు చూస్తారని తెలిపారు. సిద్దిపేటకు తాను ఇంతకుముందు మూడు విషయాల్లో బాకీ ఉన్నానని, వాటిలో రైలు వచ్చేస్తోందని, అందులో అనుమానం లేదని చెప్పారు. గోదావరి నీళ్లు రావాలని.. ఎటూ ఇరిగేషన్ మంత్రి సొంత ఎమ్మెల్యేనే కాబట్టి అవి కూడా వస్తాయని తెలిపారు. మూడోది జిల్లా అని.. అది ఇప్పటికే వచ్చేసిందని అన్నారు. పట్టుబడితే సిద్దిపేట అన్నీ సిద్ధించేవరకు పోరాడే జిల్లా అవుతుందని తెలిపారు. బతికున్నంత కాలం రాష్ట్రం కోసం కష్టపడుతూనే ఉంటాని అన్నారు. పక్క రాష్ట్రం వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి జీవిస్తే బాగుంటుందని అనుకునేలా తెలంగాణను తయారుచేస్తామన్నారు.