ఐసోలేషన్ బ్లాక్‌ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్
సాక్షి, సిద్దిపేట: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వైరస్‌కు రాష్ట్రంలో అడ్డుకట్ట వేసేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందులోభాగంగా జిల్లాల్లో కరోనా బాధితుల చికిత్స కోసం ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఆర్‌వీఎం ఆసుపత్రిలో 100 పడకల సామర్థ్యం గల కోవిడ్ ఐసోలేషన్ బ్లాక్, ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వాస్పత్రుల ద్వారా కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సర్కార్ పనిచేస్తుందన్నారు. కరోనా పోరాటంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి ప్రజలు మద్దతు ప్రకటించాల్సిన అవసరముం దని, వారి నైతిక స్థైర్యం దెబ్బతిసేలా విమర్శలు చేయొద్దని రాజకీయ పార్టీలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. మహమ్మారి కట్టడికి ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని, అనవసరంగా బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. కరోనా నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన చేసేందుకు జిల్లాల వారీగా కోవిడ్ బ్లాక్‌లను, నిర్ధారణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
కాగా, సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారి హరిత గ్రీన్ వాల్ తరహాలో ఉందని మంత్రి కితాబిచ్చారు. జిల్లాలోని వంటిమామిడి నుంచి సిద్దిపేట జిల్లా సరిహద్దులోని తోటపల్లి గ్రామం వరకు 91 కిలోమీటర్ల పొడవునా రోడుకిరువైపుల హరితహారం మొక్కలు ఒక పచ్చని గోడలా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద 91 కిలోమీటర్ల పొడవునా జరుగుతున్న పనులతో సిద్దిపేట జిల్లా దేశానికే ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment