సిద్దిపేట జోన్: ‘తెలంగాణ ఉద్యమంలో, బంగారు తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట అగ్రగామిగా ముందుకు సాగింది. ఇదే స్ఫూర్తితో అనేక వినూత్న కార్యక్రమాలకు వేదికగా మారింది. రాష్ట్రంలోనే సిద్దిపేటను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్ది ఒక కొత్త ఒరవడిని తీసుకురావాలి. అందులో భాగంగానే స్టీల్ బ్యాంక్‌ను తెస్తున్నాం. ఈ సేవలను సద్వినియోగం చేసుకుని సిద్దిపేట జిల్లా ఖ్యాతిని ప్రజలు మరింత ఇనుమడింప చేస్తారనే నమ్మకం తనకు ఉంది’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పట్టణ ప్రగతిలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 4, 13, 8 వార్డుల్లో సీఎస్‌ఆర్ సౌజన్యంతో స్టీల్ బ్యాంకును ప్రారంభించారు.
పట్టణంలో జరిగే శుభకార్యాలు, విందులు, వినోదాల సందర్భంగా ప్రస్తుతం వాడుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల స్థానంలో స్టీల్ సామగ్రి అందుబాటులోకి తేనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్టీల్ బ్యాంక్ అంటే ప్లాస్టిక్ నిషేధానికి, ప్లాస్టిక్ రహిత పట్టణానికి పునాది లాంటిదన్నారు. త్వరలో పట్టణంలోని 34 వార్డుల్లో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడబోమని, స్టీల్ బ్యాంకు సేవలను వినియోగించుకుంటామని ప్రజల చేత మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఆయా వార్డుల్లో మహిళా సంఘాల పర్యవేక్షణలో ఈ స్టీల్ బ్యాంకుల సేవలు అందిస్తాయని, నిర్వహణ నిమిత్తం నామమాత్ర రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment