తెలుగువారంతా కలిసికట్టుగా ఉండాలి | CM YS jagan Mohan Reddy Explains on Godavari Water in Assembly | Sakshi
Sakshi News home page

తెలుగువారంతా కలిసికట్టుగా ఉండాలి

Published Thu, Jul 25 2019 3:28 PM | Last Updated on Thu, Jul 25 2019 5:12 PM

CM YS jagan Mohan Reddy Explains on Godavari Water in Assembly - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మంచి జరగాలనే ఆరాటంతోనే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని, మన రాష్ట్రానికి మంచి జరగదు అనుకుంటే.. అలాంటి నిర్ణయాన్ని కచ్చితంగా తీసుకుబోమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.  గోదావరి జలాల వినియోగంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్‌ జగన్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. గోదావరి జలాల తీరుతెన్నులు, గోదావరి నీళ్లు రాష్ట్రంలోకి ఎలా ప్రవేశిస్తాయి? ఎన్ని వస్తున్నాయి? అందులో ఎన్ని ఉపయోగపడుతున్నాయి? అన్నది సీఎం వివరించారు. గోదావరి జలాలను రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున 120 రోజులపాటు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు తరలించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 480 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌ రైతులూ, ప్రజలూ బాగుపడతారని, సాగునీటి, తాగునీటి ఇబ్బందులు తీరుతాయని వివరించారు. నది జలాల పంపిణీ విషయంలో నీళ్లురావు అనుకుంటే ఇద్దరు సీఎంలు ఎందుకు ముందడుగు వేస్తారని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షం ఇచ్చిన సలహాలు కూడా తీసుకుంటామని చెప్పారు. భావితరాల కోసం ఆలోచించే తాము అవసరమైన నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు.


గోదావరి నదిలో నాలుగు పాయలుంటే.. అందులో మూడు పాయలు తెలంగాణను దాటుకొని.. ఆంధ్రలోకి ప్రవేశిస్తాయని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.  గోదావరి నదికి చెందిన ఒక పాయ నాసిక్‌ నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, ఈ పాయ ద్వారా గోదావరి మొత్తం ప్రవాహంలో 22.23శాతం తెలంగాణకు వస్తాయని వివరించారు. అయితే, ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక చిన్న, చిన్న డ్యాములు కట్టుకుంటూ పోతుండటంతో ఈ పాయ మీద ఆధారపడిన తెలంగాణలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు నీళ్లు రాని పరిస్థితి నెలకొందని, ఈ ప్రాజెక్టు కోసం కాళేశ్వరం నుంచి రివర్స్‌ పద్ధతిలో నీళ్లు తరలించుకొని పోతున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. 

గోదావరి నదిలోని రెండో పాయ ప్రాణహిత నది అని.. ఇది కూడా తెలంగాణలోకి ప్రవేశిస్తోందని వివరించారు. ఈ ప్రాణహిత సబ్‌ బేసిన్‌ ద్వారా గోదావరి మొత్తం ప్రవాహంలోని 35.46శాతం నీళ్లు వస్తాయని, గోదావరి పూర్తి నీటిలో దాదాపు 36శాతం ఈ పాయ నుంచే ప్రవహిస్తాయని వివరించారు. ఇక మూడో పాయ అయిన ఇంద్రావతి సబ్‌బేసిన్‌ కూడా తెలంగాణలోకే ప్రవేశిస్తుందని, అది మొత్తం ప్రవాహంలో దాదాపు 23శాతం ఉంటుందని వివరించారు. గోదావరి నదిలోని నాలుగు పాయల్లో మూడు పాయలు తెలంగాణను దాటిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తాయని వివరించారు. ఇక, శబరి సబ్‌ బేసిన్‌ నుంచి మాత్రమే మనకు నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోకి నీళ్లు వస్తాయని,  ఎగువన ఉన్న ఛత్తీస్‌గడ్‌,  ఒడిశా మీదుగా వచ్చే ఈ పాయ.. గోదావరి మొత్తం ప్రవాహంలో కేవలం 12శాతం మాత్రమే ఉంటుందని వివరించారు. 

తెలంగాణలో ఆశ్చర్యకరమైన పరిస్థితులు..
‘44 ఏళ్ల సీడబ్ల్యూసీ (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌) డాటా ప్రకారం సగటు చూసుకుంటే ప్రాణహిత నది.. ప్రాణహిత సంగమం దాటిన తర్వాత కాళేశ్వరం వద్ద 1709 టీఎంసీల గోదావరి నీళ్లు ఉంటాయి. ఇక, ఇంద్రావతి నది సంగమమైన తెలంగాణలోని పేరూరు వద్దకు వచ్చేసరికి గోదావరి ఉధృతి 2,489 టీఎంసీలకు చేరుకుంటుంది. మన రాష్ట్రం విషయానికి వస్తే.. శబరి నది దాటి శబరి నది సంగమమైన పోలవరం వద్ద 3,082 టీఎంసీలు గోదావరి నీళ్లు వస్తున్నాయి. ఇందులో కిందకు వచ్చేవి కేవలం ఐదారు వందల టీఎంసీల నీళ్లు మాత్రమే.

ఈ ఐదారు వందల టీఎంసీల నీళ్లు మాత్రమే మన రాష్ట్రం ఆధీనంలో ఉన్నాయి. మిగిలిన గోదావరి నీళ్లు తెలంగాణ భూభాగం దాటుకొని మన ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. ఇదీ వాస్తవ పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 450 టీఎంసీల నీళ్లు లిఫ్ట్‌ చేసుకొని వెళ్లిపోతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై.. పూర్తి కూడా అయింది. ఇక, కర్ణాకటలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 514నుంచి 524 మీటర్ల ఎత్తుకు పెంచబోతున్నారు. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నా.. ఎవరు ఆపగలుతున్నారు?’

కృష్ణానది ఎండమావి అయ్యే పరిస్థితి..
ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు కృష్ణా నది ఆయకట్టు పూర్తిగా ఎండమావి అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత 47 ఏళ్ల సగటు చూసుకుంటే కృష్ణా నుంచి శ్రీశైలానికి 1200 టీఎంసీల నీళ్లు వచ్చేవి. కానీ, గత పది సంవత్సరాల్లో చూసుకుంటే అది 600 టీఎంసీలకు పడిపోయింది. ఇక, గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే శ్రీశైలానికి కృష్ణా ప్రవాహం 400 టీఎంసీలకు పడిపోయింది. ఇక, ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును 524 మీటర్లకు పెంచితే.. కర్ణాటక మరో 100కుపైగా టీఎంసీలను నిల్వ చేసుకోగలుగుతుంది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలానికి 200 టీఎంసీల నీళ్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం ఎప్పుడు నిండుతుంది? ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు ఎప్పుడు వెళుతాయి? నాగార్జున సాగర్‌కు ఎప్పుడు వస్తాయి? ఇది ఇది ఆలోచన చేసుకోవాలి.  వాస్తవ పరిస్థితులను గమనించాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. 

గోదావరి నదిలోని 2480 టీఎంసీలు తెలంగాణను దాటుకొని మన ఆంధ్రలోకి రావాలి. మన అధీనంలోని శబరినది ద్వారా ఐదారు వందల టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్టిసీమ ద్వారా, పోలవరం కుడి కాలువ ద్వారా రాయలసీమకు నీళ్లు అందిద్దామంటే.. గోదావరి జిల్లాల్లో ఆందోళనలు చేసే పరిస్థితి ఉందని చంద్రబాబే చెబుతున్నారు. మరోవైఊపు మహారాష్ట్ర, కర్ణాటక మాదిరి  తెలంగాణ కూడా ప్రాజెక్టులకు కట్టుకుంటుపోయి.. 2,500 టీఎంసీల గోదావరి నీళ్లను మళ్లించుకొనిపోతే.. మన భూభాగంలోకి వచ్చే నీళ్లు ఎక్కడ ఉన్నాయి? ఒక్క శబరి నది నుంచి తప్ప? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ వాళ్లు ఇంకా డ్యాములు కట్టే పరిస్థితి లేదని అంటున్నారు. కానీ, కాళేశ్వరం పేరిట 17టీఎంసీలకు ఒక బ్యారేజీ చొప్పున బ్యారేజీ కట్టుకుంటూపోయారు. ఇకముందు కూడా తెలంగాణలో ఇలా చిన్న చిన్న బ్యారేజ్‌లతో నీళ్లు నింపుకుంటూ పోలేరా? చంద్రబాబు ఇక్కడ సీఎం ఉండగానే.. కాళేశ్వరం ద్వారా 450 టీఎంసీలు అక్కడివారు తరలించుకొని పోయారు? అదే కాళేశ్వరంలో ఇంకా లిఫ్టులు పెట్టుకొనిపోతే 150 టీఎంసీలు తీసుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో వాళ్లు డ్యాములు కట్టలేరు, నీళ్లు తరలించుకుపోలేరు అని గుండెల మీద చేయి వేసుకొని నిబ్బరంగా ఎలా ఉండగలం? ఇప్పటి నుంచి పది సంవత్సరాల తర్వాత భవిష్యత్తును ఆలోచిస్తే.. ఎలా ఉంటుందో ఊహించడానికి భయం అవుతోంది? కారణం ఒకవైపు నీటి వినియోగం పెరిగిపోతోంది. మరోవైపు నీటి మీద ఆధారపడే పరిస్థితి పెరుగుతోంది. నీటి లభ్యత తగ్గిపోతోంది. నీటి యుద్ధాలు జరిగే పరిస్థితి నెలకొంది. 

కృష్ణనదిలో సగటు నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయిన విషయాన్ని చూశాం. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతతో ఉండటం ఎంత అవసరమో మనం అంతా ఆలోచించుకోవాలి. తెలుగువాళ్లు అంతా ఒక్కటిగా ఉండాలి.. కలిసి పనిచేసుకోవాలి.. ఒకరికి తోడు ఒకరు ఉండాలన్న వాతావరణం అవసరమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు  ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఉండాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌పై మన రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు ఆధారపడి ఉండగా.. తెలంగాణలోని నాలుగు జిల్లాలు ఈ ప్రాజెక్టులపై ఆధారపడ్డాయి. ఈ రెండు ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి అని పేర్కొన్నారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు అల్లరి చేస్తూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఈర్ష్య తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement