సాక్షి, అమరావతి: శాసనసభలో అనుసరించాల్సిన నిబంధనల గురించి ప్రతి సభ్యుడు తెలుసుకోవాలని, అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సభలో ఉన్న సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిద్దామని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. సభలో అవకాశాలు దక్కాలంటే చేయి పైకి ఎత్తితే చాలు అని అనుకోకూడదని, నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు అడిగితేనే ఆ అవకాశం దక్కుతుందని అన్నారు.
చదవండి: ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు ప్రారంభం
ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ముందు కసరత్తు చెయ్యాలని, ఎంత గొప్ప వ్యాఖ్యాత అయిన అసెంబ్లీలో ఫెయిల్ అవుతారని ఆయన అన్నారు. సభలో నిబంధనల ప్రకారం స్పీకర్ వ్యవహరిస్తారని, ప్రతి అంశంపై సభ్యుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అవకాశం వచ్చి మాట్లాడకుంటే ఆ సభ్యుడు ఫెయిల్ అవుతారని అన్నారు. సరైన ప్రజెంటేషన్ లేకుంటే సభ్యుడు రాణించలేడని ఆయన పేర్కొన్నారు. సభా సమయాన్ని వృధా చేయొద్దని, ప్రతి ఒక్క ఎమ్మెల్యే రూల్స్ బుక్‌ని చదవాలని ముఖ్యమంత్రి సూచన చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు తాను తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రిపేర్ అయ్యేవాడనని సీఎం జగన్ తెలిపారు.
ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుంది..
ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే గత ప్రభుత్వం మైక్‌లు కట్ చేసేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ప్రభుత్వంలో ఉన్న విధంగా ఈ అసెంబ్లీ నిర్వహణ ఉండదని అన్నారు. శాసనసభలో ప్రతిపక్షం అనేది ఉంటేనే బాగుంటుందన్నారు. టీడీపీకీ 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో అయిదుగురిని లాగేస్తే ప్రతిపక్షం ఉండదని తనకు చాలామంది చెప్పారన్నారు. కానీ తాను అలా చేయనని చెప్పానని, పార్టీ మారితే రాజీనామా అయినా చేయాలి, లేకుంటే అనర్హత వేటు అయినా వేయాలని అన్నారు. ఇక్కడ గతంలో ఎక్కడా అనర్హత వేటు వేయలేదని, రాజీనామాలు చేయించలేదని, వీటిని భిన్నంగా ఉండాలంటే మనం మార్గదర్శకంగా ఉండాలన‍్నారు. మనకు వాళ్లకు తేడా ఉండాలి కదా అన్న ముఖ్యమంత్రి ప్రతిపక్షం అనేది ఉండాలని, మనం ఎవరైనా ఎమ్మెల్యేలను తీసుకోవాలంటే రాజీనామా చేయించాలని, ప్రజల్లోకి వెళ్లి మనం గెలిపించుకున్న తరువాత మన ఎమ్మెల్యే అవుతారని జగన్ పేర్కొన్నారు.
ప్రతిపక్షం ఏం మాట్లాడినా సమాధానం ఇస్తాం
ఇప్పుడు ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడేందుకు పూర్తి అవకాశం ఇస్తామని, వారు చెప్పేది కూడా పూర్తి విందామని సీఎం తెలిపారు. ఆ తర్వాత ప‍్రభుత్వం చెప్పే సమాధానంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. మనపై మనకు, పాలనపై అంతకన్న నమ్మకం ఉందని అన్నారు. చంద్రబాబు గురించి చెప్పేముందు ఒక్క మాట కూడా చెప్పాలని, ఆయనకు చంద్రబాబుకు అబద్దాలు చెప్పే అలవాటు ఉందని.. గతంలో అందరికి గుర్తు ఉండే ఉంటుందని, నాన్నగారు (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ఒక ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నకిలీ డాక్యుమెంటరీ తీసుకొచ్చారని, అసెంబ్లీలో నాన్నకు కూడా అర్థం కాలేదని, ఏంటి అని గమనిస్తే..ఆ డ్యాకుమెంట్ నకిలీ అని గుర్తించారని అన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో నాన్నగారు ఒరిజినల్ డాక్యుమెంటరీ ఎందుకు చూపించావు అంటే..ఆయన అబద్ధాలు చెప్పారన్నారు. ఇలా అబద్ధాలు ఆడితేనే మీరు నిజం చెబుతానని చంద్రబాబు ఒప్పుకున్నారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. అలాంటి తప్పుడు పని ఈ అసెంబ్లీలో సభ్యులెవరూ చేయకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సభలో మోసాలు, అబద్ధం చెప్పే కార్యక్రమం ఉండకూడదని, సభలో తప్పు చేయొద్దని, అవాస్తవాలు చెప్పొద్దని ముఖ్యమంత్రి సూచిస్తూ...చర్చ జరిగే అంశంపై పూర్తి అవగాహనతో రావాలన‍్నారు. సభ్యులు సమావేశాలకు గైర్హాజరు కావద్దని కోరారు. అసెంబ్లీ ప్రారంభం కంటే కనీసం 30 నిమిషాలు ముందు ఉండాలని, ప్రతి పదిమంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యేలను సమన్వయం కోసం కేటాయిస్తామన్నారు. ఈసారి హుందాగా సభ నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. చట్టాలు చేసే సభలో ప్రతి చట్టాన్ని గౌరవిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కాగా స్పీకర్ తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment