సాక్షి, గుంటూరు : సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో టీడీపీలోని అంతర్గత కుమ్ములాటలు ఒక్కోటిగా తెరమీదకు వస్తున్నాయి. పార్టీలో ఉన్న వారికి, ఆశావాహులకు మధ్య టికెట్ కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి, అనంతపురం, గుంటూరులో మాజీలకు, తాజాలకు మధ్య వర్గ విభేధాలు భగ్గుమన్నాయి.
గుంటూరు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు షాకిచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి సత్తెనపల్లి టికెట్‌ను రాయపాటి కుమారుడికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు.. కోడెలను నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తిరుపతి..
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆశావాహుల సంఖ్య అధికమవుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఈ క్రమంలో నరసింహ యాదవ్ తన వర్గంతో అమరావతి చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా తన వర్గంతో అమరావతికి పయనమవడంతో.. తిరుపతి టీడీపీ నేతల గొడవలు ముదిరి పాకాన పడుతున్నాయి.
అనంతపురం..
గుంతకల్లు టీడీపీలో ప్రస్తుత ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్.. మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తా మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఇటీవలే టీడీపీలో చేరిన మధుసూదన గుప్తా తొలిసారి పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. అయితే ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు మధుసూదన గుప్తాను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు మధుసూదన గుప్తాను టీడీపీ కార్యాలయం నుంచి బయటకు పంపించారు. మధుసూదన గుప్తా కొంత కాలంగా గుంతకల్లు టికెట్ తనకే ఖరారైందంటూ ప్రచారం చేస్తుండటం పట్ల జితేంద్ర గౌడ్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment