బుజ్జి వర్సెస్‌ పెదబాబు | Conflicts In TDP Party West Godavari | Sakshi
Sakshi News home page

బుజ్జి వర్సెస్‌ పెదబాబు

Published Wed, Sep 12 2018 1:19 PM | Last Updated on Wed, Sep 12 2018 1:19 PM

Conflicts In TDP Party West Godavari - Sakshi

వివాదానికి కారణమైన వాట్సాప్‌ చిత్రం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) నగరపాలక సంస్థ కో–ఆప్షన్‌ సభ్యుడు, మేయర్‌ నూర్జహాన్‌ భర్త ఎస్‌ఎంఆర్‌ పెదబాబు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో పెదబాబు నగరంలో ఏర్పాటు చేసిన కటౌట్లను తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించడం, తర్వాత వాటిని తొలగించడం తెలిసిందే. అప్పటి నుంచి ఇరువురి మధ్య మొక్కుబడి సంబ«ంధాలే కొనసాగుతున్నాయి. తాజాగా వాట్సాప్‌లో మేయర్‌ కార్యాలయ సిబ్బంది తయారు చేసిన ప్రచార పర్వంలో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడం, దీనిపై ఎమ్మెల్యే పెదబాబును నిలదీయడంతో వివాదం చెలరేగింది. దీంతో తాను, మేయర్‌ తమ పదవులకు రాజీనామా చేస్తామని పెదబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే...
స్థానిక పోణంగిరోడ్డులో పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లను మేయర్, కార్పొరేటర్ల బృందం రెండు రోజుల క్రితం పరిశీలించి వచ్చింది. ఆ తర్వాత మేయర్‌ సందర్శన ఫొటోలను ఫొటోషాపులో డిజైన్‌ చేశారు. అందులో మేయర్‌ నూర్జహాన్, అమె భర్త పెదబాబు ఇతర కార్పొరేటర్ల ఫొటోలతో పాటు సీఎం చంద్రబాబు ఫొటో మాత్రమే ఉంది. అందులో ఎక్కడా ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఫొటో లేదు. వీటిని పార్టీకి చెందిన అన్ని వాట్సాప్‌ గ్రూపులలో పంపించారు. అయితే ఇందులో తమ ప్రమేయం లేదని మేయర్‌ వర్గం వాదిస్తోంది. తన ఫొటో లేకుండా మేయర్, ఆమె భర్త ఫొటోలు హల్‌చల్‌ చేయడంతో ఎమ్మెల్యే బుజ్జి ఆగ్రహించారు. సోమవారం సాయంత్రం ఆయన కో–ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబుకు ఫోన్‌ చేసి ఈ ఫొటోల గురించి నిలదీశారు.

ఇది మంచి సంప్రదాయం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందులో తమ ప్రమేయం లేదని, ఎవరో చేసిన పనికి తనను నిలదీస్తే ఎలా అంటూ పెదబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగినట్లు సమాచారం. తాను పైసా కూడా ఆశించకుండా నగరాభివృద్ధి కోసం, పార్టీ కోసం పనిచేస్తుంటే ప్రతిసారి తనను టార్గెట్‌ చేయడం సరికాదని చెప్పిన పెదబాబు తాము మేయర్, కో–ఆప్షన్‌ పదవుల నుంచి తప్పుకుంటామని చెప్పి ఫోన్‌ పెట్టేసినట్లు తెలిసింది. దీంతో సోమవారం రాత్రి ఎమ్మెల్యే బుజ్జి తమ కార్పొరేటర్లతో ఈ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా ఉండటమే మంచిదని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు తెలిసింది. మంగళవారం పలువురు కార్పొరేటర్లు మేయర్‌ను కలిసి రాజీనామా చేసే ఆలోచన చేయవద్దని కోరారు. అయితే వారు తమ నిర్ణయం తెలపకుండా మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. మనసులో ఏదో పెట్టుకుని పదేపదే వేధిం చడం కరెక్టు కాదని పెదబాబు తమను కలిసిన వారితో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎమ్మెల్యే, మేయర్‌ విభేదాలతో కార్పొరేటర్లు ఆయోమయంలో పడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement