మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి, చిత్రంలో మధుయాష్కీ, శ్రవణ్, భట్టి, జానారెడ్డి, కుంతియా, షబ్బీర్‌అలీ, పొన్నాల తదితరులు
సాక్షి, హైదరాబాద్: తాము అసాధ్యపు హామీలను ఇవ్వడం లేదని, అన్ని వివరాలను అధ్యయనం చేసిన తర్వాతే ఎన్నికల హామీలు ఇస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ చెపుతున్నట్టు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అసాధ్యమేమీ కాదని, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.300 కోట్లు కేటాయించడం కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మహ్మద్‌సలీం, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలసి ఆయన మాట్లాడారు.
నిరుద్యోగ భృతి విషయంలో సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అనుమానాలు సరైనవి కావన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇవ్వడానికి కేవలం రూ.300 కోట్లు అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు నికరంగా రూ.10,500 కోట్ల ఆదాయం వస్తోందని సీఎం స్వయంగా చెప్పారని, అలాంటప్పుడు నిరుద్యోగులకు రూ.300 కోట్లు కేటాయించలేమా అని ప్రశ్నించారు. ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులకు భృతి ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికలకు మేం రెడీ..
ఎన్నికలు ముందస్తు జరిగినా, షెడ్యూల్ ప్రకారం జరిగినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్‌లో తాము కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. భావసారూప్య పార్టీలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే విషయాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాహుల్‌నుద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చిల్లర మాటలని పీసీసీ చీఫ్ అన్నారు. కేటీఆర్ రాజకీయ అవగాహన లేని చిన్న పిల్లాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లు దిగజారి మాట్లాడుతున్నారని, సూర్యుని మీద ఉమ్మి వేస్తే వారి మీదే పడుతుందన్న విషయాన్ని వారు గ్రహించాలని హితవు పలికారు.
టీఆర్‌ఎస్ కంటే భారీ సభ...
అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తాము అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రజలకు హామీలిస్తున్నామని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించే సభ కన్నా భారీ సభను తామూ నిర్వహిస్తామన్నారు. త్వరలో బస్సుయాత్ర ప్రారంభిస్తామని, సెప్టెంబర్‌లో కూడా రాహుల్ రాష్ట్రానికి వస్తారని చెప్పారు. అభ్యర్థుల ప్రకటన కోసం త్వరలోనే ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు వేస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల పట్ల రాహుల్ చాలా సంతృప్తిగా ఉన్నారని, ఈ విషయా న్ని ఆయనే స్వయంగా చెప్పారని వెల్లడించారు.
రాహుల్ టూర్ సక్సెస్
రాహుల్‌గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన అద్భుతంగా సాగిందని, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు ఊహించిన దాని కన్నా ఎక్కు వ మంది వచ్చారని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ముఖ్యంగా విద్యార్థులు, యువతలో ఉన్న ఆగ్రహానికి ప్రతీకగా ఈ సభ నిలుస్తుందని చెప్పారు. రాహుల్ టూర్‌తో కేసీఆర్‌కు దడ పుట్టిందని, అందుకే మహిళా సంఘాలకు ఉన్న బకాయిల్లో రూ.960 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. మహిళా సంఘాలకు ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలోని కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ పట్ల రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. సెటిలర్లకు ఇచ్చిన హామీలను కూడా చిత్తశుద్ధితో నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment