మహాకూటమి..! | Is Congress And TDP Forming As Mahakutami In Telangana 2019 Elections | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్లేలా కాంగ్రెస్‌ వ్యూహరచన

Published Tue, Sep 4 2018 1:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Is Congress And TDP Forming As Mahakutami In Telangana 2019 Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)ని ఢీకొట్టేందుకు ఇతర విపక్షాలతో కలసి ‘మహాకూటమి’ ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. టీడీపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితులతో కలసి ఎన్నికల బరిలోకి దూకేందుకు వ్యూహరచన చేస్తోంది. పార్టీపరంగా తమకు కొన్ని సీట్లు తగ్గినా బలమైన పార్టీని గద్దె దింపాలంటే ఇతర పక్షాలతో సర్దుబాటు చేసుకోకతప్పదనే నిర్ణయానికి వచ్చింది. మొత్తం మీద తమతోపాటు ఆ నాలుగు పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణలో కేవలం త్రిముఖ పోటీకి పరిమితం కావాలని, తద్వారా ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటామనే భావన కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది.

ఆ రెండు పార్టీలు ఓకే...
రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల్లో బీజేపీ మినహా అన్ని పార్టీలతో కలసి పనిచేసే అవకాశముందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. అందులో భాగంగానే టీడీపీ, సీపీఐ, సీపీఎం, జన సమితులను కలుపుకొని పోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే టీడీపీ, సీపీఐలతో చర్చలను దాదాపు ముగించారు. తెలుగుదేశం పార్టీకి 15 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం, సీపీఐకి 4 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలు సుముఖంగానే ఉన్నారు. టీడీపీ, సీపీఐలు కూడా కాంగ్రెస్‌తో జత కట్టేందుకు సిద్ధంకావడంతో ఆ రెండు పార్టీలతో కలిసే కాంగ్రెస్‌ ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నా సీపీఎంను కూడా కలుపుకొనిపోవాలన్నది వారి ఎజెండాగా ఉంది. అయితే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌తో తాము కలసి పోటీ చేయబోమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పటికే పలుమార్లు ప్రకటించగా ఆ పార్టీలోని కిందిస్థాయి కేడర్‌ మాత్రం ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉంది. అయినా ఈ అంశాన్ని నాయకత్వం పట్టించుకోవడం లేదు.

 ఢిల్లీ స్థాయిలో చర్చలు
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీలతో పొత్తులుం డవని చెబుతున్న సీపీఎంను దారిలోకి తెచ్చుకు నేందుకు కాంగ్రెస్‌ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి ఒకరు ఇప్పటికే భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రాథమిక చర్చల్లో వీరభద్రం తన వాదనకే కట్టుబడ్డారని, తాము స్వతంత్రంగానే ఉంటామని ఆయన చెప్పినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీలోని సీపీఎం నాయకత్వంతో కలసి దీన్ని పరిష్కరించుకోవాలనే అభిప్రాయంతో ఉంది. తెలంగాణలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు సీపీఎం జాతీయ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పక్షాన ఇప్పటికే ప్రకటించినట్టుగా బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదనను తెరపైకి తేవాలని, ఇందుకు అంగీకరిస్తే తమకేమీ అభ్యంతరం లేదని కొందరు సీపీఎం నేతలంటున్నారు. కానీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులను ప్రకటించే పరిస్థితి తమ పార్టీలో ఉండదని, ఎన్నికల తర్వాత ఆ ప్రతిపాదన చూద్దామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నట్టు తెలిసింది. మొత్తంమీద సీపీఎం కూడా పొత్తుకు సై అంటే ఆ పార్టీకి నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు సీపీఎం ఒకవేళ అంగీకరించకుంటే ఆ పార్టీ కోరిన కొన్ని స్థానాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు చెబుతున్నారు.

కోదండరాంతో కాంగ్రెస్‌ ముఖ్య నేత భేటీ...
ఎన్నికల్లో కలసి పోటీ చేయడంపై తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు కోదండరాంతో కూడా కాంగ్రెస్‌కు చెందిన ఓ ముఖ్య నాయకుడు రెండు నెలల క్రితమే భేటీ అయినట్టు తెలుస్తోంది. విడివిడిగా పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఇరుపక్షాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఇరు పార్టీల ప్రాథమిక రాజకీయ లక్ష్యం నెరవేరాలంటే పొత్తు అనివార్యమనే చర్చ ఈ భేటీలో జరిగినట్టు సమాచారం. అయితే కోదండరాం కూడా పొత్తుకు సానుకూలత వ్యక్తం చేయకపోయినా నిరాకరించలేదని గాంధీ భవన్‌ వర్గాలంటున్నాయి. ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో ఈ చర్చలను ముమ్మరం చేస్తామని మాజీ మంత్రి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కాగా, టీజేఎస్, సీపీఐల మధ్య గతంలో జరిగిన పొత్తు చర్చల్లోనూ కాంగ్రెస్‌తో జతకట్టే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. టీజేఎస్‌ పొత్తుకు అంగీకరిస్తే 6 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, చర్చల అనంతరం ఎన్ని స్థానాలివ్వాలో తేలుతుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. సీపీఎం, టీజేఎస్‌తో చర్చలు కూడా ఈ నెలలోనే ముగిసే అవకాశాలు కనిపిస్తుండటం గమనార్హం.

జనసేనతో సీపీఎం పొత్తు యోచన...
సీపీఎంను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంటే ఆ పార్టీ మాత్రం సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిధి బృందంతో వీరభద్రం చర్చలు కూడా జరిపారు. అయితే రాష్ట్రంలో ఉనికిలోలేని జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల సీపీఎం తుడిచిపెట్టుకుపోతుందని, రాష్ట్ర నాయకత్వం వైఖరిలో మార్పు లేకుంటే తిరుగుబాటు చేయాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఒకరు హెచ్చరించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ కూటమితో జట్టు కడితే రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవచ్చన్న యోచనలో సీపీఎం కేడర్‌ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement