మంగళవారం తెలంగాణ భవన్‌లో భిక్షమయ్యగౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గొంగిడి సునీత తదితరులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ కుదేలైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకలేదని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారిని అభ్యర్థులుగా నిలిపారని ఎద్దేవా చేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, ఏఐసీసీ సభ్యుడు లక్ష్మణ్‌రావుగౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జూకంటి రవీందర్ తమ అనుచరులతో కలసి తెలంగాణభవన్‌లో మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వా నించారు. వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఉత్తమ్.. ముందు ఎమ్మెల్యేగా రాజీనామా చెయ్
కాంగ్రెస్‌లో పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్న వారు నల్లగొండ జిల్లాకున్నా ఆ ప్రాంతానికి ఒరిగిందేమి లేదని కేటీఆర్ అన్నారు. ‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు పుణ్యమా అని గెలిచారు. ఉత్తమ్‌కు దమ్ముంటే హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నల్లగొండలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో చెల్లని రూపాయి. భువనగిరిలో పోటీ చేస్తున్నాడు. ఒక చోట చెల్లని రూపాయి ఎక్కడైనా చెల్లని రూపాయే. జాలీ నోటులా భువనగిరిలో చొరబడ్డ కోమటిరెడ్డిని ఓడించి ఇంటికి సాగనంపడానికి ఇదే సరైన సమయం. టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు పార్టీలో చేరుతున్న అందరికీ స్వాగతం..’అని వ్యాఖ్యానించారు.
అవి పరాయి పార్టీలు..
తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్‌ఎస్ అని కేటీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్, బీజేపీ పరాయి పార్టీలు. ఇంటి పార్టీని గెలిపించుకుంటేనే తెలంగాణకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే ఢిల్లీ చెప్పినట్టే నడుచుకుంటారు. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ ప్రజలు చెప్పినట్టు నడుచుకుంటారు. 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే వారికి 150 మంది తోడవుతారు. కేసీఆర్ కొత్త కూటమి కట్టి ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఏర్పడాలో నిర్ణయిస్తారు. దేశానికి కావాల్సింది చౌకీ దార్, టేకేదార్ కాదు... కేసీఆర్ లాంటి జిమ్మేదార్ కావాలి. జై కిసాన్ అనేది కాంగ్రెస్, బీజేపీలకు నినాదమైతే టీఆర్‌ఎస్‌కు ఓ విధానం. కేసీఆర్ ఆలోచనలు ఢిల్లీలో అమలు కావాలంటే 16 మంది ఎంపీలను గెలిపించుకోవాలి. కేసీఆర్‌ను రోజూ తిట్టే చంద్రబాబుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను విధిలేక అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..’అని చెప్పారు
ఆలేరు రూపురేఖలు మారనున్నాయి..
కాంగ్రెస్, బీజేపీ సోదిలోనే లేవు.. అసలు టీడీపీ ఎన్నికల బరిలోనే లేదని కేటీఆర్ అన్నారు. ‘బీజేపీ రామమందిర నిర్మాణాన్ని 25 ఏళ్లుగా చెబుతూనే ఉంది. హిందుత్వకు తామే సిద్ధాంతకర్తలమని బీజేపీ నేతలు చెప్పుకుంటారు. కేసీఆర్ లాగా రూ.2 వేల కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? యాదాద్రి గుడి, గంధమళ్ల రిజర్వాయర్‌లతో ఆలేరు రూపురేఖలు మారనున్నాయి. టీఆర్‌ఎస్‌లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నాం. టీఆర్‌ఎస్‌లో కొత్తా పాతా అంటూ తేడాలుండవు. అందరూ ఐకమత్యంతో పని చేసి ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. పార్టీలో చేరిన వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తాం..’అని కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment