
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులను, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేశారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా నిరోద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామని ప్రకటిస్తే.. వేలం పాట పాడినట్లు మరో రూ.16 పెంచి రూ.3,016 ఇస్తామంటూ కేసీఆర్ నిరుద్యోగులను అవమానపరిచారన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వంద రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటించడంతో కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైందని, అందుకే కొత్త పల్లవి అందుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులున్నారని, వారంతా ఈ విషయమై కేసీఆర్‌ను నిలదీయాలని కోరారు. అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు.
అవినీతికే అప్పులు..
కేవలం కమీషన్లు, అవినీతి చేసేందుకే కేసీఆర్ రూ.70 వేల కోట్ల అప్పులు చేశారని దాసోజు ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు దమ్ముంటే శాఖల వారీగా సృష్టించిన సంపద ఎంత, పెట్టిన ఖర్చు ఎంత, అప్పులు ఎంత అన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ ప్రకటించిన కేసీఆర్ ఇంతకుముందే ఒకే దఫాలో ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ప్రగతిభవన్‌ను ఖాళీ చేసి.. ఫాంహౌస్‌లో వ్యవసాయం చేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికల్లో ఓటేయకుంటే తరిమివేస్తామన్న ధోరణిలో మాట్లాడుతున్నారని దాసోజు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment