హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కారెక్కడానికి సిద్ధంగా ఉన్నట్టు వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను క్రియాశీలకంగా కాంగ్రెస్‌లోనే పనిచేస్తున్నానని, ఈ పార్టీలోనే ఉండబోతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ముఖేష్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుతో చర్చించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 నియోజకవర్గాల్లో పార్టీ కోసం పర్యటించానని, తన ఇళ్లు గాంధీభవన్ పరిసరాల్లోనే ఉందని, కావున ఇంట్లోనే ఉన్నా గాంధీ భవన్‌లో ఉన్నట్టేనని అన్నారు. తాను ప్రస్తుతం బోసు రాజు సలహాలు, సూచనలు తీసుకున్నానని చెప్పారు. ఇంకా మరింత మంది పార్టీ నేతలతో చర్చించి, కాంగ్రెస్‌ను మరింత బలపడేలా చేస్తానని తెలిపారు. పార్టీ ఇంఛార్జ్, పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేతలతో ముఖేష్ టచ్‌లోనే ఉన్నాడని బోసు రాజు కూడా చెప్పారు.
పార్టీని మరింత బలోపేతం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని ముఖేష్‌కు తాను సూచించానని బోసు రాజు తెలిపారు. ఈ భేటీతో గత కొన్ని రోజులుగా ముఖేష్, టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నాడనే వార్తలకు కళ్లెం పడింది. మరోవైపు రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులపై ముగ్గురు సెక్రటరీలతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామాల్లో కాంగ్రెస్‌కు అనుకూలత కనిపిస్తోందని రాహుల్‌కు వివరించినట్టు ఏఐసీసీ కార్యదర్శి ఎన్ఎస్ బోసురాజు తెలిపారు. మండల స్థాయి నుంచి పీసీసీ వరకు పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ సెక్రటరీలకు సూచించినట్టు తెలిసింది.తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారాన్ని అధిష్టానం నుంచి అందిస్తామని రాహుల్ తెలిపారని బోసు రాజు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment