సాక్షి, హైదరాబాద్ : నేడు దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ వద్ద మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క మల్లు, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు అనిల్ యాదవ్, ఇందిరా శోభన్, తదితరులు పూలమాల వేసి వైఎస్సార్‌కు ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా దివంగత నేత సేవల్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసిన నేతలు అనంతరం రక్త దానం కార్యక్రమం చేపట్టారు.
డాక్టర్ వైఎస్సార్ ఆశయాలతో ముందుకు సాగుతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పలు సాగు, తాగు నీటి ప్రాజెక్టులు మొదలు పెట్టిన ఘనత వైఎస్సార్ దేనని చెప్పారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టిన ఘనత ఆయనదేనని భట్టి అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్‌లో దివంగత నేత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి భట్టి నివాళులు అర్పించారు.
ఇందిరా భవన్‌లో ఈ కార్యక్రమంలో పేదలకు కేవీపీ రామచంద్రరావు దుప్పట్ల పంపిణీ చేశారు. తులసి రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల పాల్గొన్నారు. వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన్నారని, ఆయన ఆశయాలను నెరవేరుస్తామని షబ్బీర్ అన్నారు. వైఎస్సార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంతో పాటు హైదరాబాద్‌లో మెట్రోరైలు ఘనత వైఎస్సార్‌దేనని అంజన్‌కుమార్ కొనియాడారు. ఆరోగ్య శ్రీ, 108 కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేదలకు ఉచితంగా వైద్యం అందించారని వైఎస్సార్ సేవల్ని స్మరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment