సాక్షి, న్యూఢిల్లీ : వరుస పరాజయాలతో డీలా పడ్డ కాంగ్రెస్ పొత్తులకు సై అంటోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీ త్వరలో జరగనున్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్‌తో పొత్తుకు సన్నద్ధమైంది. బెంగాల్‌లో వామపక్ష ఫ్రంట్‌తో జత కట్టేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కూటమిగా అవతరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, ఆ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం వీయడంతో కాంగ్రెస్, వామపక్షాలు పునరాలోచనలో పడిన నేపథ్యంలో బెంగాల్‌లో కాంగ్రెస్-వామపక్ష కూటమి కొలిక్కివచ్చింది.
ఇక ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్ధానాలకు గాను కాంగ్రెస్ కేవలం రెండు స్ధానాలతోనే సరిపెట్టుకోగా, లెఫ్ట్‌ఫ్రంట్ ఖాతా తెరవలేదు. పశ్చిమ బెంగాల్ పార్టీ చీఫ్ సోమెన్ మిత్రాతో కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ సమావేశమైన క్రమంలో బెంగాల్‌లో రానున్న మూడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేయడం సహా పలు సంస్ధాగత అంశాలపై చర్చించినట్టు సమాచారం. నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలోని కలియాగంజ్, పశ్చిమ మిడ్నపూర్ జిల్లా ఖరగ్‌పూర్, నదియా జిల్లాలోని కరీంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment