ఏం సాధించారని అవార్డులు..? | Congress MLA Jeevan Reddy Criticize On Kcr | Sakshi
Sakshi News home page

ఏం సాధించారని అవార్డులు..?

Published Mon, Jun 4 2018 10:20 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Congress MLA Jeevan Reddy Criticize On Kcr - Sakshi

మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

సాక్షి, జగిత్యాల: రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా అవార్డులు.. ఇచ్చిన ప్రశంసపత్రాల ప్రదానంలో అధికారులు సరైన ప్రమాణాలు పాటించలేదని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల పూర్తయిన రైతుబంధు, సబ్సీడీ గొర్రెల పంపిణీ పథకం, మత్స్యకారులకు చేపల పంపిణీ, భూ రికార్డుల ప్రక్షాళన, స్వచ్ఛ జగిత్యాల అంతా ఓ బూటకమని ఎద్దేవా చేశారు. ఆయా రంగాలకు అవార్డులు ప్రదానం చేయడం దారుణమన్నారు. అవార్డులకు గుర్తింపు లభించే విధంగా అర్హులకే అవార్డులు ప్రదానం చేయాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించారని మండిపడ్డారు.

జిల్లాలో రైతుబంధు పథకం అమలు అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఇప్పటికే అనేక ప్రచార, ప్రసార మాధ్యమాల్లో రైతుబంధు వైఫల్యం బట్టబయలైందన్నారు. అయినా.. జిల్లాకు ఎక్సలెన్సీ అవార్డు రావడం దారుణమన్నారు. పథకం పూర్తయిన తర్వాత.. నిర్వహించిన సమీక్షలో సాక్ష్యాత్తూ సీఎం అధికారులకు చీవాట్లు పెట్టిన పరిస్థితి వచ్చిందన్నారు. ఫలితంగా.. ఎక్సలెన్సీ అవార్డు వచ్చిన జిల్లాకూ అన్ని జిల్లాలతో పాటే స్పెషలాఫీసర్‌ నియామకం జరిగిందన్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో విఫలమైందన్నారు. తొలి విడతలో 9,769 యూనిట్లలో 2.10లక్షల జీవాలు పంపిణీ చేస్తే.. అందులో 25శాతం చనిపోయాయని, మేత లేక మరో 25శాతం ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని పేర్కొన్నారు.

అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీ చేయించి పంపిణీ చేసిన గొర్రెల్లో ఏ మేరకు గొల్లకుర్మల వద్ద ఉన్నాయో లెక్క తేల్చాలని డిమాండ్‌ చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో ఒక్కో గొర్రెను రూ. 5,700తో కొనుగోలు చేస్తే.. కొనుగోలు చేసిన గొర్రె ప్రస్తుత ధర రూ. 3,500కు మించడం లేదన్నారు. జీవాల ధర పతనం కావడంతో.. అర్హులైన గొల్లకుర్మలు తమ జీవాలను అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్య కార్మికులకు పంపిణీ చేసిన చేప పిల్లలూ ఎండకు చనిపోయాయన్నారు. స్వచ్ఛ భారత్‌– స్వచ్ఛ జగిత్యాలలో బహిరంగ మల, మూత్ర విసర్జన అటకెక్కిందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న పది వేలకు పైగా మంది లబ్ధిదారులకు ఇప్పటికీ బిల్లులు రాలేదని.. వారందరూ ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ పద్రక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాను స్వచ్ఛ జగిత్యాలగా ప్రకటించడంతోనే బిల్లులు మంజూరు కావడం లేదన్నారు.

కేవలం జగిత్యాల పట్టణంలోనే నాలుగొందల కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే జిల్లాలో పథకం అమలు తీరు తెన్నులు అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యాహక్కు చట్టాన్ని కనీసం ఈ ఏడాదైనా అమలు చేసి కార్పొరేట్, ప్రైవేట్‌ స్కూళ్లలో నిరుపేదలకు 25శాతం సీట్లు ఇప్పించి విద్య అందించాలని డిమాండ్‌ చేశారు. పొరుగు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇప్పటి వరకు రెండుసార్లు డీఎస్సీ నిర్వహించి టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తే.. మన రాష్ట్రంలో మాత్రం ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు.

అలాగే.. విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్‌ కల్పించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. అలాగే... ఇస్లాం మతంలో ఇతరుల ప్రమేయం సహించరాని నేరమని జీవన్‌రెడ్డి చెప్పారు. ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లని కేసీఆర్‌కు ముస్లింల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు ఇచ్చే పెట్టుబడి రాయితీ గురించి కశ్మీర్, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో భారీగా ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ విజయలక్ష్మీ, వైస్‌ చైర్మన్‌ సిరాజొద్దీన్‌ మన్సూర్, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శంకర్, కొలుగూరి దామోదర్, గాజుల రాజేందర్, ముకస్సిర్‌ అలీ నేహాల్, గిరి నాగభూషణం, రియాజ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement