
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగాను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న ‘ప్రజా చైతన్య బస్సు యాత్ర’మరో దశ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నెలంతా యాత్ర నిర్వహించాలని, అనంతరం అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్భం గా రాష్ట్రంలో ఎక్కడైనా బహిరంగ సభ నిర్వహించాల ని టీపీసీసీ నిర్ణయించింది. మంగళవారం గాంధీభవన్‌లో బస్సుయాత్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, కార్యదర్శి సలీం, కమిటీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, కోకన్వీనర్ మహేశ్వర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బస్సుయాత్ర మరోదశ నిర్వహణపై కూలంకషంగా చర్చించారు. ఈ సారి 3, 4 చోట్ల సభలు నిర్వహించాలని, అవి ఒకే నియోజకవర్గంలో అయినా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ తుదిరూపు నేడో, రేపో వెలువడే అవకాశాలుండగా, సెప్టెంబర్1 నుంచి ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా పార్టీ కొంత బలహీనంగా ఉందని భావిస్తున్న ఉత్తర తెలంగాణలో సోనియాగాంధీ పాల్గొనేలా ఆహ్వానించాలని, పార్టీ అధినేత రాహుల్ చేత దక్షిణ తెలంగాణలో మరోసారి పర్యటింపచేయాలని కూడా నిర్ణయించారు. బస్సుయాత్ర ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల ఇండ్లు, వాహనాలపై పార్టీ జెండాలు ఎగురవేయించాలని కూడా నిర్ణయించారు. బస్సుయాత్ర సమన్వయం కోసం మరో కమిటీ కూడా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment