కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్(పాత చిత్రం)
ఢిల్లీ: బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రవణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని గడ్చిరౌలీలో నక్సలైట్ దాడిని బీజేపీ ఆపలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పౌరసత్వంపై లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తోందని, ఉద్యోగాల కల్పనలో రైతులకు మద్ధతు ధర కల్పించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులు పెద్దఎత్తున దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీశారని, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయేలా చేశారని దుయ్యబట్టారు. ఈ అంశాలను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 2004, 2009లో రాహుల్ గాంధీ ఎంపీగా పనిచేశారు.. కానీ మరోసారి బీజేపీ పౌరసత్వం వివాదం లేపడం విడ్డూరంగా ఉందన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మతిభ్రమించి రాహుల్ గాంధీకి నోటీసులు పంపారని వ్యాక్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించబోతుందని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీని కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిపేస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment