![Congress Spokesperson Dasoju Sravan Slams TRS Government In Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/30/sravan.jpg.webp?itok=3M24oFny)
ఢిల్లీ: తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జగమెరిగిన అబద్దాల కోరు అని రుజువైందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. 796 మంది విద్యార్థుల మొమోలతో మాత్రమే తప్పులు ఉన్నాయని మంత్రి చెబుతున్నారు.. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మాత్రం 6415 మంది విద్యార్థుల మార్కుల షీట్లు సరి చేశానని చెబుతోంది... ఈ రెండింటిలో ఏది నిజమో ప్రభుత్వమే చెప్పాలని సూటిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అడిగారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డిని తక్షణమే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే త్రిసభ్య కమిటీ రిపోర్టును బయటపెట్టాలన్నారు. ముగ్గురు సభ్యులు సంతకాలు పెట్టిన నివేదికను దాచిపెట్టి దొంగ నివేదికను బయటపెట్టారని ఆరోపించారు. 110 పేజీల నివేదికను త్రిసభ్య కమిటీ రూపొందిస్తే కేవలం పది పేజీల నివేదికను మాత్రమే బయటపెట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎవరిని రక్షించడానికి త్రిసభ్యు కమిటీ నివేదికను దాచిపెడుతున్నారని విమర్శించారు. గ్లోబరెనా సంస్థతో ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటివరకు ఎటువంటి ఒప్పందం చేసుకోలేదని వెల్లడించారు. లక్షలాది మంది విద్యార్థులతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ఎందుకు నిర్లక్ష్యం వహించారని తూర్పారబట్టారు.
ఒప్పందం లేకపోవడం వల్లే సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతోందన్నారు. విద్యార్థుల చావుకు కారణమైన ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్, ఐవీఆర్‌లను వెంటనే ప్రారంభించాలని కోరారు. గ్లోబరెనా అనే దొంగ సంస్థకే తాళం చెవి ఇస్తున్నారని ముందుగానే మీడియా హెచ్చరించింది. అయినా ప్రభుత్వం దీన్ని కాపాడే ప్రయత్నం చేసిందని విమర్శించారు. గ్లోబరెనా మంచి కంపెనీ అని 2018లోనే ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment