
సాక్షి, హైదరాబాద్ : తీవ్రవాదం వల్ల కలిగే నష్టం గురించి బీజేపీ చెప్తే వినాల్సిన దుస్థితిలో రాహుల్ గాంధీ లేరని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదిని జీ అన్నందుకు రాహుల్ గాంధీ ఏదో పెద్ద నేరం చేసినట్లు బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండి పడ్డారు. తీవ్రవాదం వల్ల కలిగే నష్టం గురించి రాహుల్ గాంధీకి బీజేపీ చెప్పాల్సిన పని లేదన్నారు. ఎందుకంటే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఇద్దరూ తీవ్రవాదుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయారని ఆమె గుర్తు చేశారు. కాబట్టి తీవ్రవాదం వల్ల కలిగే బాధ రాహుల్ గాంధీకే బాగా తెలుసని విజయశాంతి అన్నారు.
అంతేకాక తన తండ్రి రాజీవ్ గాంధీని అమానుషంగా హత్య చేసిన ఎల్టీటీఈ సభ్యులకు విధించిన మరణ శిక్షను కూడా రద్దు చేయమని చెప్పి రాహుల్ మానవతావాదాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. కానీ బీజేపీ నేతలు దీన్ని కూడా తప్పుగా ప్రచారం చేస్తారని ఆరోపించారు. ఉరిశిక్షను రద్దు చేయమని చెప్పినందువల్ల బీజేపీ నాయకులు రేపు రాహుల్ గాంధీ.. ఎల్టీటీఈ తీవ్ర వాదులతో కుమ్మక్కయ్యారని ప్రచారం చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్‌ని విమర్శించడానికి కారణం దొరక్క బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుండటం శోచనీయమాన్నారు.
Comments
Please login to add a commentAdd a comment