
సాక్షి, బోధన్: మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వ్యుహప్రతివ్యూహాలతో ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ కోణంలోనే ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశాయి. ఓటర్ల ఆశీస్సులను పొందేందుకు అనుసరించాల్సిన ప్రచార వ్యుహాన్ని అభ్యర్థులకు ప్రధాన రాజకీయ పార్టీలు దిశా నిర్దేశం చేస్తున్నాయి.
అభ్యర్థులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, వార్డు అబివృద్ధి పాటుపడతామని, సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తామని ఓటర్లకు హామీలను ఇస్తున్నారు. వార్డుల్లో మద్దతుదారులతో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులుండగా, ఇందులో 19వ వార్డు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖమరున్నీసా బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 37 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు చైర్మన్ పీఠం దక్కించుకునే వ్యూహంతో పోటాపోటీగా ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో నిలిపాయి.
టీఆర్‌ఎస్ 37 వార్డులు, బీజేపీ 21 వార్డులు, కాంగ్రెస్ 35 వార్డులు, ఎంఐఎం 19, సీపీఎం, టీడీపీలు ఒకటి చొప్పున వార్డుల్లో పోటీ చేస్తుండగా, 37 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పలువార్డులు ప్రధాన రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం కనిపిస్తోంది.
వ్యూహాత్మకంగా పార్టీల ప్రచారం
టీఆర్‌ఎస్ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఓటర్లకు వివరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు కేంద్రంలో నరేంద్రమోదీ అమలు చేస్తున్న సుపరిపాలన, జాతీయ స్థాయి అంశాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తుండగా, కాంగ్రెస్ గతంలో తమ హయాంలో మున్సిపల్ పాలక వర్గంలో చేపట్టిన పట్టణాభివృద్ధి పనులను ప్రస్తావిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను పూర్తి చేయడంలో వైఫల్యాలను, స్థానిక సమస్యల పరిష్కారంపై అధికారపక్ష నిర్లక్ష్యం వైఖరిని వివరిస్తున్నారు.
ఎంఐఎం సైలెంట్‌గా వార్డుల్లో ప్రచారానికి పదును పెట్టింది. పార్టీలు వార్డుల్లో అనుకూల, ప్రతికూల ఓటర్ల లెక్కలను వేస్తున్నాయి. కుల సంఘాలు, యువత, మహిళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల యువనాయకులను తమ వైపు తిప్పుకునేందుకు తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నాయి.
ప్రముఖ నేతలను రప్పించే యత్నాలు
ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారానికి ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీ ప్రముఖ ప్రజాప్రతినిధులు, నాయకులను రప్పించేందుకు యత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు ఈ నెల 20న టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ శనివారం ప్రచారం చేశారు. బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వార్డుల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment