సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి, ఆలేరు, మునుగోడు, మంచిర్యాల, దేవరకొండ, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాము పోటీ చేస్తామని చెప్పారు. రెండు మూడ్రోజుల్లో తేల్చకుంటే 9 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ స్థానాలు తమకు కావాలని కాంగ్రెస్‌కు జాబితా కూడా అందించినట్లు చెప్పారు. వీటిలోనూ మరో 3 స్థానాలు తగ్గించుకుని 6 స్థానాలకైనా అంగీకరిస్తామని వెల్లడించారు. సీట్ల సర్దుబాటు గౌరవప్రదంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు. కాంగ్రెస్‌లో ఆ వైఖరి కనిపించట్లేదన్నారు. దసరాలోపే సీట్ల సర్దుబాటు పూర్తి కావాలని తాము కోరామని, అయినా ఇప్పటిదాకా అది పూర్తి కాకపోవడం బాధాకరమని చాడ పేర్కొన్నారు. పొత్తు కుదిరితే ప్లాన్ ఏ, కుదరకుంటే ప్లాన్ బీ అమలు చేయాల ని పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సంకేతా లు రాలేదన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిపినా సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదన్నారు. అందుకే సీట్లను బయట పెట్టినట్లు తెలిపారు. ప్లాన్ బీ ప్రకారం 20 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు.
సీపీఐ పోరుబాట పుస్తకావిష్కరణ
గతేడాది అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 3 వరకు చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పోరుబాటు కార్యక్రమానికి సంబంధించిన పుస్తకాన్ని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి చేసిన కృషి తదితర అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా వారితో కలసి పనిచేస్తామని సురవరం తెలిపారు.
9 స్థానాల్లో పోటీ చేస్తాం: చాడ
Published Tue, Nov 6 2018 1:41 AM | Last Updated on Tue, Nov 6 2018 2:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment