సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు పదవీ వ్యామోహం మరోసారి వెల్లడైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓట్లు కొనేందుకు ప్రభుత్వ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారని, అధికారం ఉందని ఎన్నికల అధికారులను దబాయించారని దుయ్యబట్టారు. ఓటమి భయంతోనే అసహనానికి గురయ్యారని మండిపడ్డారు. 50 లక్షల మంది ఓట్లను ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు తొలగించారన్నారు.
చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర కనబడకుండా ఆయనను హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ రెండు సినిమాలు తీయించారని తెలిపారు. ఆ సినిమాలను కూడా ప్రజలు ఆదరించలేదన్నారు. బావ చాటు బాలయ్య ఈ సినిమాలు తీసి భంగపడ్డారని ఎద్దేవా చేశారు. తన వెన్నుపోటు చరిత్ర బయటపడుతుందన్న భయంతో రాంగోపాల్ వర్మ తీసిన సినిమా విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారన్నారు. టీడీపీ నాయకులు పచ్చ చొక్కాలతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అమ్మా, అయ్యా అంటూ ఓట్లు అడిగారని తెలిపారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు రిగ్గింగ్‌కు ప్రయత్నించారని ఆరోపించారు.
జనసేన-టీడీపీ కుమ్ముక్కు
జనసేన అభ్యర్థులంతా రాష్ట్రవ్యాప్తంగా చివరి నిమిషంలో టీడీపీకి సహకరించారని వెల్లడించారు. గాజువాకలో పవన్ కళ్యాణ్‌ను గెలిపించేందుకు టీడీపీ అభ్యర్థి సహకరించారని ఆరోపించారు. విశాఖలో బాలకృష్ణ చిన్నల్లుడు, టీడీపీ అభ్యర్థి భరత్‌ను పక్కనపెట్టి జనసేనకు సహకరించమని నారా లోకేశ్ సూచించారని తెలిపారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు సంయమనంతో వ్యవహరించారని ప్రశంసించారు. మార్పు తీసుకొస్తున్నామన్న భావన ఓటర్ల ముఖాల్లో కనిపించిందని దాడి వీరభద్రరావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment