గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదురొడ్డి పోరాడిన ముగ్గురు యువకుల్లో జగ్నేష్ మేవానీ ఒకరు. దళితుడైన మెవానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేవలం 18 నెలల్లోనే ఎమ్మెల్యేగా బనస్కాంత జిల్లా వడ్గామ్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల చేతుల్లో అనాదిగా అణగారిపోతున్న తమ గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తారని దళితులు ఆశిస్తున్నారు. మేవానీని తమ ఆశాదీపంగా కొనియాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థిపై దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓబీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో యువ నాయకుడు అల్పేశ్ ఠాకూర్.. పటాన్ జిల్లా రాధాన్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన పటీదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు అసెంబ్లీకి పోటీచేసే వయస్సు లేకపోవడం వల్ల బరిలోకి దిగలేదు.
2016, జూలై నెలలోనే మేవాని రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ఉనాలో ఓ చనిపోయిన ఆవు ఛర్మాన్ని వలుస్తుంటే నలుగురు దళిత యువకులపై అగ్రవర్ణాలకు చెందిన యువకులు దాడిచేసి దారుణంగా హింసించారు. ఆ సంఘటనతో కదిలిపోయిన మేవాని, దళిత యువకులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దళితుల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకొని ‘ఉనా దళిత్ అత్యాచార్ లడత్’ సమితిని ఏర్పాటు చేశారు. లాయరైన మెవానీ కొంత కాలం జర్నలిస్ట్‌గా పనిచేసి ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా మారారు. దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఆయన ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ముందుకెళుతున్నారు.
నేడు రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యావంతుడైన మేవానీ తప్పకుండా అసెంబ్లీ ముందుకు తీసుకెళతారనే విశ్వాసం తమకు పూర్తిగా ఉందని సురేంద్రనగర్ జిల్లా దళిత నాయకుడు నాథూభాయ్ పార్మర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేవాని విజయం ఇతర సామాజిక కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుందని, వారు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుత వ్యవస్థను మార్చేందుకు కృషి చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉనా సంఘటన అనంతరం మేవానీ తమకు ఎంతో మేలు చేశారని ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు పాతికేళ్ల సర్వాయ చెప్పారు. మేవానీ నాయకత్వంలో తమకు న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్న ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఉనా సంఘటనపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేయలేదు. కేసులో నిందితులను అరెస్ట్‌చేసి బెయిల్‌పై విడుదల చేశారు. మేవానీతోపాటు దసడ, దారిలింమ్డా, కోడినార్, కలవడ్, గధడ అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి కూడా దళితులు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. గత అసెంబ్లీలో కాంగ్రెస్, స్వతంత్య్ర అభ్యర్థులుగా ముగ్గురు దళితులు విజయం సాధించగా ఈసారి ఆరుగురు దళితులు విజయం సాధించడం విశేషం. అయితే మేవానీ రాజకీయాల్లో చేరకుండా సామాజిక కార్యకర్తల్లా దళితుల హక్కుల కోసం పోరాడితేనే బాగుండేదని కొంత మంది దళిత నాయకులు, ఘనశ్యామ్ షా లాంటి రాజకీయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment