
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అవినీతి లేదని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, అదే నిజమైతే కర్ణాటక తరహాలో రాష్ట్రంలో లోక్‌పాల్ బిల్లును తీసుకురాగలరా అని పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నీతివంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్, పచ్చి అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
తమ అవినీతిని, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్నారని ఆరోపించారు. ధర్నా చౌక్ లేకుండా చేయడమేకాక, ప్రజాస్వామిక నిరసనలకు అవకాశం లేకుండా నియంతృత్వ ధోరణిని కనబరుస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రూ.60 వేల కోట్ల అప్పులుంటే గడిచిన మూడేళ్లలోనే రూ.90 వేలకోట్లు అప్పు చేశారన్నారు.
తెలుగుతల్లి లేదని చెప్పిన కేసీఆర్, అదే తెలుగు భాష కోసం రూ.200 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో ఉంటున్న సీమాంధ్ర పెట్టుబడిదారులకు సన్మానాలు చేస్తున్నారని విమర్శించారు. అలాగే ఉద్యమ కాలంలో కబ్జాకోరులుగా ఉన్న సినిమా నిర్మాతలు, నటులు తెలంగాణ రాష్ట్రంలో సన్మానాలు చేయించుకుంటున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment