
దాసోజు శ్రావణ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్ కుక్కలు చింపిన విస్తరిలా మార్చారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది బ్రాంతి అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. అసమర్థతకు కేసీఆర్ పరాకాష్ట అని వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతుంటే.. కేసీఆర్ అణచివేత పాలన కొనసాగిస్తున్నారని శ్రవణ్ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్‌లోనే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నాటకం అడుతున్నారని అన్నారు. బీజేపీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారిపోయారని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని.. కేసీఆర్ వ్యవహారశైలిని ఎండగడుతూ ఫ్రంట్‌లో భాగంగా ఆయన్ని కలిసిన నేతలందరికీ లేఖలు రాశామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రజల దృష్టి మళ్లీంచడానికే ఫెడరల్ ఫ్రంట్ నాటకమాడుతున్నారని లేఖలో వారికి వివరించినట్టు చెప్పారు. ఫ్రంట్‌లో భాగంగా కేసీఆర్ ఇకముందు ఎవరిని కలిసిన వారికి ఇలాగే లేఖలు రాస్తామని పేర్కొన్నారు.