కుమార స్వామిని ఆశీర్వదిస్తున్న దేవెగౌడ (ఫైల్ పోటో)
విధి విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకలో తమను కాదని గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీ నేత యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయమనడంపై కాంగ్రెస్, దేవెగౌడ పార్టీ జేడీఎస్ గొంతు చించుకుని అరుస్తున్నాయి. అయితే, ఒకప్పుడు గుజరాత్‌లో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ సర్కారును అక్రమంగా గద్దెదించడంలో కాంగ్రెస్ పార్టీ, దేవెగౌడ తమ పాత్రలను మరచిపోయినట్టున్నారు.
అలాగే మెజారిటీ లేకున్నా, సక్రమ పద్ధతుల్లో మెజారిటీ లభించే ఆస్కారమే లేకుండా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ నేత యడ్యూరప్ప సమాయాత్తమౌతున్నారు. ఇలాగే గతంలో ప్రధానిగా ప్రమాణం చేసి మెజారిటీ నిరూపించుకోలేక రాజీనామా చేసిన వాజ్‌పేయిని యడ్యూరప్ప మరచిపోయినట్టున్నారు. విచిత్రం ఏమిటంటే రెండు సందర్భాల్లోనూ దేవెగౌడ పాత్ర ఉండడం.
గవర్నర్ సిఫార్సుతో గుజరాత్ సీఎం మెహతా బర్తరఫ్!
అది 1996 సెప్టెంబర్. గుజరాత్‌లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై సీనియర్ నేత శంకర్‌సింహ్ వాఘేలా వర్గీయులు మరోసారి తిరుగుబాటు చేశారు. మెహతా ప్రభుత్వానికి అసెంబ్లీలో 121 మంది బీజేపీ శాసనసభ్యుల మద్దతు ఉండగా, వారిలో 40 మంది తనను సమర్థిస్తున్నారని వాఘేలా ప్రకటించి, ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.
వాఘేలా-పారిఖ్ వర్గం సురేశ్‌మెహతా సర్కారుపై అవిశ్వాసం ప్రకటించి, తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో బీజేపీ సర్కారు మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి చెందిన స్పీకర్ హెచ్‌ఎల్ పటేల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు సభను నడిపించిన కాంగ్రెస్‌కు చెందిన ఉపసభాపతి చందూభాయ్ ధాబీ వాఘేలా-పారిఖ్ వర్గానికి గుర్తింపు ఇచ్చారు.
మళ్లీ కోలుకుని అసెంబ్లీకి వచ్చిన స్పీకర్ పటేల్ డెప్యూటీ స్పీకర్ ఉత్తర్వును రద్దు చేయడం గందరగోళం, కొట్లాటలలకు దారితీసింది. అసెంబ్లీలో కనీవినీ ఎరగని స్థాయిలో రభస కారణంగా బలపరీక్షకు ఓటింగ్ నిర్వహించడం కుదరలేదు. వాఘేలా వర్గం, కాంగ్రెస్ రాష్ట్ర గవర్నర్ కృష్ణపాల్‌సింగ్‌ను కలిసి మెహతా సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.
బీజేపీ సర్కారు రద్దుకు గవర్నర్ సిఫార్సు
రాష్ట్ర అసెంబ్లీ కార్యకలాపాలు రాజ్యాంగబద్ధంగా, సజావుగా సాగే పరిస్థితి లేదనీ, ఓటింగ్ నిర్వహణ అసాధ్యమని చెబుతూ మెహతా ప్రభుత్వం రద్దుకు గవర్నర్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడిన అప్పటి దేవెగౌడ ప్రభుత్వం గవర్నర్ నివేదిక అందిన వెంటనే సురేశ్ మెహతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఇప్పటి కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా అప్పుడు గుజరాత్ బీజేపీ అధ్యక్షుని హోదాలో తమ పార్టీ సర్కారుకు జరిగిన ‘అన్యాయాన్ని’ కళ్లారా చూశారు.
ఇప్పుడు అదే దేవెవగౌడ కొడుకు కుమారస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కోరినా వజూభాయ్ పట్టించుకోలేదు. చివరికి అసెంబ్లీలో అతి పెద్ద పక్షమైన బీజేపీకే మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం వజూభాయ్ ఇచ్చారు.
మెజారిటీ నిరూపించుకోలేక వాజ్‌పేయి రాజీనామా!
కర్ణాటక అసెంబ్లీలో అతి పెద్ద పార్టీ బీజేపీ(104 సీట్లు) నేత బీఎస్ యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్ ఆహ్వానించినట్టే 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ పక్ష నేత అటల్ బిహారీ వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ఆహ్వానించారు. పార్లమెంటు ఎన్నికల్లో 161 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.
ఎన్నికల నాటి పాలకపక్షమైన కాంగ్రెస్ 140 స్థానాలకు పరిమితం కాగా, ఒకప్పటి (1989-90) పాలకపక్షం జనతాదళ్ 46 సీట్లు సాధించింది. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీరాని పక్షంలో అతి పెద్దపక్షాన్నే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలన్న పూర్వ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ నెలకొల్పిన సంప్రదాయాన్ని శర్మ అనుసరిస్తూ మెజారిటీ సభ్యుల మద్దతు లేకున్నా వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి ఆయనతో ప్రధానిగా ప్రమాణం చేయించారు.
మెజారిటీ నిరూపణకు వాజ్‌పేయి సర్కారు లోక్‌సభలో విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టగా దానిపై చర్చ కూడా మొదలైంది. అయితే, కనీస మెజారిటీకి అవసరమైన 272 మంది సభ్యుల మద్దతు కూడగట్టడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఓటింగ్‌కు ముందే వాజ్‌పేయి రాజీనామా
మెజారిటీ నిరూపణకు గడువు సమీపించడంతో విశ్వాస తీర్మానంపై చర్చకు జవాబుగా ప్రధాని హోదాలో వాజ్‌పేయి ఆవేశపూరితంగా ప్రసంగించాక పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడే సంకీర్ణ సర్కారుకు మద్దతివ్వడానికి కాంగ్రెసేతర జాతీయ. ప్రాంతీయపార్టీలు అంగీకరించలేదు.
బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే తన ‘లౌకిక’ లక్ష్యంతో జనతాదళ్ నాయకత్వాన యునైటెడ్ ఫ్రంట్(యూఎఫ్) ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వడానికి పీవీ నేతృత్వంలోని కాంగ్రెస్ అంగీకరించింది.
జాతీయపక్షం ముఖ్యమంత్రి దేవెగౌడను వరించిన ప్రధాని పదవి!
జనతాదళ్‌కు చెందిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ దేవెగౌడను ఎట్టకేలకు ఒప్పించడంతో ఆయన జనతాదళ్, యూఎఫ్ నేతగా ఎన్నికయ్యారు. జనతాదళ్ సాధించిన 46 సీట్లలో 16 కర్ణాటకలో గెలిచినవే.
ఏడాదిన్నరగా ఉన్న సీఎం పదవికి రాజీనామా చేసి, తనకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని రాష్ట్రపతి శర్మకు తెలిపారు. బయటి నుంచి కాంగ్రెస్, సీపీఎంతో కూడిన వామపక్షాల మద్దతు ఉన్న కారణంగా దేవెగౌడతో మైనారిటీ ప్రభుత్వ ప్రధానిగా శర్మ ప్రమాణం చేయించారు.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment