
చెన్నై : అన్నాడీఎంకే మంత్రులకు నిజ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తాయని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపట్ల తమకు అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని ముందునుంచి డిమాండ్ చేస్తున్న ఆయన తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి స్పందించారు.
తాము జయలలితను చూశామని, ఆమెను ఆస్పత్రిలో కలిశామని కొందరు మంత్రలు, తాము చెప్పినవి అబద్ధాలని ప్రజలను మోసం చేసినందుకు క్షమించాలని మరికొందరు మంత్రులు చెప్పడం, ఆస్పత్రిలో చేరే సమయంలో జయలలిత స్పృహలో లేరని, ఆమె శ్వాస కూడా లేకుండా మగతగా పడి ఉన్నారని తాజాగా మెడికల్ రిపోర్టు బయటకు రావడంతో జయలలిత మృతి విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ స్పందిస్తూ 'ఈ అనుమానాలన్నింటికి పరిష్కారం ఒక్కటే అదే లై డిటెన్షన్ టెస్ట్. ప్రస్తుతం ఉన్న మంత్రులందరికీ నిజనిర్దారణ పరీక్ష చేస్తే మొత్తం నిజాలు బయటకు వస్తాయి' అని ఆయన రిపోర్టర్లకు చెప్పారు.