అది ఎన్నికల కమిషనర్‌పై కక్షేనా!? | Election Commission Notices Hava Sound Basis | Sakshi
Sakshi News home page

అది ఎన్నికల కమిషనర్‌పై కక్షేనా!?

Published Thu, Sep 26 2019 2:49 PM | Last Updated on Thu, Sep 26 2019 2:49 PM

Election Commission Notices Hava Sound Basis - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా భార్య నావెల్‌ సింఘాల్‌ లావాసా దాఖలు చేసిన పన్ను రిటర్న్స్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆదాయం పన్ను శాఖ సోమవారం నాడు నోటీసులు జారీ చేయడం కొన్ని వర్గాల్లో అనుమానాలకు దారి తీసింది. పలు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నందున ఆమె చూపిన పన్ను రిటర్న్స్‌పై సహజంగానే అనుమానాలు రావచ్చు. పైగా నోటీసులు జారీ చేసినంత మాత్రాన అందుకున్న వాళ్లు అవినీతికి పాల్పడినట్లు అర్థమూ కాదు. ‘ర్యాండమ్‌’ తనిఖీల కింద ఆదాయం పన్ను శాఖ పలువురికి ఇలాంటి నోటీసులు జారీ చేయడం కూడా సర్వ సాధారణమే. 

అయితే అశోక్‌ లావాసా కుటుంబ సభ్యుల్లో ఆయన సోదరి శకుంతలా లావాసాకు, ఆయన కుమారుడు అభిర్‌ లావాసా వాటాదారుడిగా ఉన్న ఓ పుస్తకాల కంపెనీకి, అందులోనూ 2008 నుంచి 2010 మధ్య చోటు చేసుకున్న లావాదేవీలకు సంబంధించి ఆదాయం పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం సాధారణము కాదు, యాధశ్చికమూ అంతకంటే కాదు. మరి ఎందకు ఈ నోటీసులు జారీ అయినట్లు ? దీని వెనక కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉన్నాయా?


ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా,  భార్య నావెల్‌ సింఘాల్‌ లావాసా

గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలకు వ్యతిరేకంగా దాఖలైన ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసుల్లో ఐదింటిలో మిగితా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఇచ్చిన ‘క్లీన్‌చిట్‌’లను ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా తీవ్రంగా వ్యతిరేకించారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన వాదనను లిఖిత పూర్వకంగా ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. తన అభ్యంతరాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిందిగా డిమాండ్‌ కూడా చేశారు. తన డిమాండ్‌ను నెరవేర్చే వరకు ఆ తదుపరి ఎన్నికల కమిషన్‌ సమావేశాలకు హాజరుకానంటూ సవాల్‌ చేసి, హాజరుకాలేదు. అయినప్పటకీ ఆయన డిమాండ్‌ ‘సమాచార హక్కు’ పరిధిలోకి రాదంటూ మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు త్రోసిపుచ్చారు. 

లావాసా ఇప్పటికీ సిట్టింగ్‌ ఎన్నికల కమిషనర్‌ అవడం వల్ల అక్టోబర్‌లో జరుగనున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ రెండు రాష్ట్రాల్లోను బీజేపీయే అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. ఎన్నికల కమిషన్‌ స్వయం ప్రతిపత్తిగల సంస్థ. ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ పట్ల పక్షపాత వైఖరిని కనబర్చకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలి. ఆదాయం పన్ను శాఖ లావాసా కుటుంబ సభ్యులకు జారీ చేసిన నోటీసులు సబబేనని, వారు అవినీతికి పాల్పడ్డారని సకాలంలో నిరూపించాలి. అలాకాని పక్షంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన పెద్దలు, నిష్పక్షపాతంగా పనిచేసిన అధికారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడినట్లే! అప్పుడు అది కచ్చితంగా ఎన్కికల కమిషన్‌ ‘అటానమి’ని దెబ్బతీయడమే అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement