సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ ఘాటుగా బదులిచ్చింది. బెంగాల్‌లో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీపై మండిపడ్డ మమతా ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకే తాము నిర్ణయాలు తీసుకుంటామని, తమ విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది.
కాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు కోల్‌కతా పోలీస్ కమిషనర్ అనుజ్ శర్మతో సహా నలుగురు బెంగాల్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని శనివారం మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీకి అనుకూలంగా ఉద్దేశపూరితంగా ఈసీ తమ అధికారులను బదిలీ చేసిందని ఆమె ఆరోపించారు. వరుసగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈసీ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని, స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరుగుతాయా అనే సందేహం నెలకొందని దీదీ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బెంగాల్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగే అవకాశం లేదని బీజేపీ నేతలు ఆరోపించిన క్రమంలో ఈసీ అధికారుల బదిలీ నిర్ణయం వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment