
ఔరంగాబాద్: శివసేన పార్టీ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాధవ్ ఇంటిపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు దాడి చేసి.. బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో కొందరు దుండగులు జాధవ్ ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో జాధవ్ ఇంటి కిటికీ అద్దాలు, కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌కు కూడా గాయాలయ్యాయి. దాడి సమయంలో జాధవ్ భార్య, వారి ఇద్దరు కొడుకులు ఇంట్లోనే ఉన్నారు.
శివసేన పార్టీని వీడిన జాధవ్ తాజా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఔరంగాబాద్‌లోని కన్నడ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇటీవల ఓ ఎన్నికల సభలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేసినట్టు జాధవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఠాక్రే పట్ల అభ్యంతర భాషను వాడుతూ ఆయన మాట్లాడినట్టు భావిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే జాధవ్ ఇంటిపై దాడి జరిగింది. ‘జై భవానీ, జై శివాజీ’ అనే నినాదాలుచేస్తూ దుండగులు తమ ఇంటిపై దాడి చేశారని జాధవ్ భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
శివసేన సీనియర్ నాయకుడైన హర్షవర్థన్ జాధవ్ పార్టీ అధినాయకత్వం తీరు నచ్చక ఇటీవల పార్టీని వీడారు. కాంగ్రెస్ మాజీ మంత్రి అబ్దుల్ సత్తార్‌ను ఠాక్రే శివసేనలోకి తీసుకోవడం జాధవ్‌కు నచ్చలేదు. సత్తార్ శివసేన అభ్యర్థిగా శిలోద్ నుంచి పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment