సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో గ్రోత్ (వృద్ధి) జరిగింది. దానికి మేమేం చేయగలం?’’అని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ వ్యాఖ్యానించారు. మద్యం అమ్మకాల ద్వారా రూ.21 వేల కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న బీజేపీ సభ్యుల ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో గుడుంబా నిర్మూలన, పునరావాస చర్యలపై మంగళవారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పద్మారావుగౌడ్ మాట్లాడారు.
గుడుంబా కారణంగా తమవారు చనిపోతున్నారని గతంలో వరంగల్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో కొందరు మహిళలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని.. దాంతో చలించిపోయిన ముఖ్యమంత్రి గుడుంబాను నిర్మూలిస్తామని ప్రకటించారని చెప్పారు. ఈ మేరకు ఆబ్కారీ శాఖ 2015 సెప్టెంబర్‌లో గుడుంబాపై యుద్ధాన్ని ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో 98 శాతం ప్రాంతాల్లో గుడుంబాను నిర్మూలించామని.. 89 మందిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. గుడుంబా తయారీ, విక్రయంలో నిమగ్నమైన కుటుంబాలకు పునరావాసం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం 100 శాతం సబ్సిడీతో రూ.2 లక్షల రుణాలు అందజేస్తున్నామన్నారు.
చట్టంలో లోపంతో..
బడులు, ప్రార్థనా స్థలాలకు 100 మీటర్లలోపు దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయరాదనే నిబంధన ఉన్నా.. చట్టంలోని పలు లోపాలతో పలు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వకతప్పడం లేదని పద్మారావుగౌడ్ చెప్పారు. మద్యం షాపులకు గుడి/బడికి మధ్య రోడ్డు డివైడర్లు ఉంటే.. డివైడర్ల వల్ల పెరిగే దూరాన్ని సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఎక్సైజ్ చట్టంలో ఉందన్నారు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ఎక్సైజ్ చట్టానికి సవరణ చేయాల్సి ఉందన్నారు. ఇక హైదరాబాద్‌లో గుడుంబా తయారీ, అమ్మకాలకు కేంద్రమైన ధూల్‌పేట్ ప్రాంతవాసులకు పునరావాసం కల్పించేందుకు ముఖ్యమంత్రితో చర్చించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలోని ఐదెకరాల ఖాళీ స్థలంలో చేతివృత్తులు, లేదా ఏదైనా ఇతర పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు.
ప్రమాదకర స్థాయికి మద్యం అమ్మకాలు
ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రమాదకర స్థాయికి చేరాయని శాసనసభలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గుడుంబా నిర్మూలన, పునరావాస కార్యక్రమంపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగట్టాయి. చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఏటా రూ.30– 40 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతు న్నాయని.. ఉత్తరప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇంత భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగడం లేదని బీజేపీఎల్పీనేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మద్యం అమ్మకాల ద్వారా రూ.21 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. ఇందుకోసం మద్యం విక్రయాల సమయాన్ని రాత్రి 11 గంటల వరకు పెంచిందని, మాల్స్‌లో సైతం విక్రయాలకు అనుమతిచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.. జనం మద్యపానం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ధూల్‌పేట్‌లో ఖాళీగా ఉన్న ఐదెకరాల స్థలంలో పరిశ్రమను నెలకొల్పి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని బీజేపీ మరో సభ్యుడు రాజాసింగ్ లోధా డిమాండ్ చేశారు. ఇక గుడుంబా నిర్మూలన స్ఫూర్తితో రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి గుడుంబా అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని టీఆర్‌ఎస్ సభ్యురాలు గొంగిడి సునీత సూచించారు. గుడులు, ప్రార్థనా స్థలాల సమీపంలోని మద్యం షాపులను తొలగించాలని ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొహియుద్దీన్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment