సాక్షి– నిజామాబాద్ :భారత పార్లమెంట్‌కు జరుగుతున్న తొలి ఎన్నికలవి. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీకి చెందిన నాయకున్ని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం.. ఇక్కడ ఆయన గెలిచాక ఆయన ఢిల్లీకి వెళ్లిపోవడం పరిపాటైంది. వరుసగా 1952, 1957, 1962 ఎన్నికల్లో ఇదే తీరు.. ఈ మూడుసార్లూ గెలిచిన హరిశ్చంద్ర హెడా స్థానికంగా అందుబాటులో ఉండకపోయేవారు. ఈ క్రమంలో ఇందూరుపై స్థానికేతరుల ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు 30 ఏళ్ల యువకుడు. కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని స్థానికులకే ఇవ్వాలనే వాదనను వినిపించారు. పార్టీ తీరు మారకపోవడంతో తానే స్వయంగా స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ‘స్థానికత’ సత్తా ఏమిటో చాటారు. ఆయనే ఎం.నారాయణరెడ్డి. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగగా, స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించిన ఒకే ఒక్క నేత ఆయన. ఇందూరు తొలి స్థానిక ఎంపీగానూ ఘనత వహించారు. 1972కు ముందు కాంగ్రెస్‌లో చేరిన నారాయణరెడ్డి బోధన్ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ పలకరించినపుడు నాటి రాజకీయ పరిస్థితులు, అభ్యర్థిత్వాలు, ప్రచారశైలిపై తన మనోగతాన్ని పంచుకున్నారు.- పాత బాలప్రసాద్ గుప్త,
బ్యాలెట్ బాక్స్‌కు పసుపు,కుంకుమ పూసి మొక్కేవారు..
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు కాడెడ్లు. రెండు ఎడ్లు, కాణి ఉండేది. ఈ గుర్తును అప్పట్లో పరమశివుడి వద్ద ఉండే నందులుగా భావించేవారు ఓటర్లు. ఓటేసేందుకు వచ్చినప్పుడు తమ వెంట పసుపు, కుంకుమ, పూలు తెచ్చుకుని ఈ గుర్తుపై ఓటేసేవారు. ఇలాంటి ఘటనలు అప్పట్లో దేశవ్యాప్తంగా చోటు చేసుకునేవి. అంత పవిత్రమైన కాంగ్రెస్ గుర్తుపై ఎవరు పోటీ చేసినా విజయం సునాయాసంగా వరించేది. ప్రజలు కూడా అభ్యర్థి ఎవరనేది పెద్దగా చూసేవారు కాదు. కాంగ్రెస్ తప్ప వేరే పార్టీలు లేవు. సోషలిస్టు పార్టీ ఉన్నా.. ప్రభావం అంతంతే.. దీన్ని ఆసరా చేసుకుని ఢిల్లీ పెద్దలు స్థానికేతరులను మాపై రుద్దేవారు. దీన్ని గట్టిగా వ్యతిరేకించాను. జిల్లాలో ఉన్న యువతను, విద్యార్థులను ఏకం చేశాను. స్థానికులెవరికైనా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశాం. 1962లో కూడా స్థానికేతరులకే టికెట్ ఇస్తున్నారని తెలిసి.. జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్యనేతల వద్దకు వెళ్లి ప్రశ్నించాం. దీంతో అధిష్టానం పెద్దలు నాపై ఒత్తిడి తెచ్చారు. స్థానికత వాదనను పక్కనపెడితే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకుంటామని హామీనిచ్చారు. నేను ఒప్పుకోలేదు. 1967 ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి.. స్థానికేతరుల పెత్తనాన్ని అడ్డుకోవడానికి ఉద్యమించిన నన్నే ఈసారి ఎంపీగా బరిలోకి దిగాలని జిల్లా వాసులంతా ఒప్పించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాను.
సైకిళ్ల మీద తిరిగి ప్రచారం చేశాం..
అప్పట్లో పెద్దగా వాహన సదుపాయం ఉండేది కాదు. నేను పోటీ చేసినప్పుడు ఆర్మూర్‌కు చెందిన భూస్వామి జీపు ఇచ్చి సాయం చేశారు. అప్పట్లో చేతిమైక్‌లు ఉండేవి. అప్పట్లో నా ప్రచారం వినూత్నంగా సాగేది. నేను ఆ రోజు ఏ గ్రామాలకు వెళ్తానో ఆ ముందు రోజే నా గుర్తు, ఫొటోలతో కూడిన కరపత్రాలను ఆ గ్రామానికి పంపేవాడిని. మర్నాడు నేను గ్రామానికి వెళ్లే సరికి గ్రామస్తులంతా ఆ కార్డులు పట్టుకుని నా దగ్గరకు వచ్చేవారు. నా ప్రచార తీరుకు నా ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి హరిశ్చంద్ర హెడే సైతం ఆశ్చర్యపోయే వారు. గ్రామాల్లో పటేల్, పట్వారీ వ్యవస్థ ఉండేది. వాళ్లు ఎవరికి చెబితే వాళ్లకే ఓట్లు పడేవి. దీంతో అభ్యర్థులు నేరుగా వీరినే కలిసే వారు.
మీకు ఓటెయ్యబోమని ముందే నిక్కచ్చిగా చెప్పేవారు..
గతంలో ప్రజలు నిక్కచ్చిగా ఉండేవారు. ఫలానా కారణాల వల్ల మీకు ఓటెయ్యబోమని ముఖం మీదే చెప్పేవారు. రాజకీయాల్లోనూ విలువలు ఉండేవి. కులతత్వం ఉండేది కాదు. ప్రస్తుతం నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కుల సంఘాల భవనాలకే ఇస్తున్నారు. అంటే సమాజంలో కులాలను నేతలే ప్రోత్సహిస్తున్నారు. కుల సంఘాలు కూడా అలాగే తయారయ్యాయి. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని చూడటం లేదు. తమ కుల సంఘానికి ఎంతిస్తారంటూ అభ్యర్థుల దగ్గరకు వెళుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు.
ఓటరు చైతన్య కార్యక్రమాలునిరంతరం జరగాలి..
వినియోగదారుల హక్కులపై ఎలాగైతే నిరంతర చైతన్యం చేస్తున్నారో.. ఓటరు చైతన్య కార్యక్రమాలూ నిరంతరం జరగాలి. ఇందుకోసం వివిధ స్థాయిల్లో ఓటరు ఫోరాలు ఏర్పాటు చేయాలి. ఎన్నికలప్పుడే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఫోరం సమావేశమై ఓటర్లను చైతన్యం చేస్తూనే గెలిచిన అభ్యర్థి పనితీరుపై సమీక్షలు, చర్చావేదికలు నిర్వహించాలి. ఇది జరగకపోతే ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు తన అధికార బలంతో ప్రత్యర్థులను లేకుండా చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment