ముఖాముఖిలో భువనగిరి ఎంపీ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్
సాక్షి, భువనగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తమ ఇంటి మనిషిగా, పెద్ద కొడుకులా చూస్తూ మరోసారి గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారని టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సాక్షితో ఆయన మాట్లాడారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలుతోనే ఓట్లు పడతాయి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 40 నుంచి 60 వేల లబ్ధిదారులు ఆసరా పింఛన్ పొందుతున్నారు. వారంతా కేసీఆర్‌ను ఢిల్లీ రాజకీయాల్లో ఉన్నత పదవిలో చూడాలని చూస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళితే రాష్ట్రానికి అధిక బడ్జెట్ తీసుకువస్తారని వారి నమ్మకం. గడిచిన ఐదేళ్లల్లో ఏ ఎంపీ చేయనంత పని చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు సాధించడంలో ముందున్నాను. రెండోసారి అభ్యర్థిగా రంగంలోకి దిగిన తనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రకుల పేదల మద్దతు కూడా లభిస్తోంది.
9 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 9లక్షల ఎకరాలకు సాగునీరందించే మహోత్తర కార్యక్రమం నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్‌లు, మూసీ కాల్వల అభివృద్ధి, నక్కలగండి, రుద్రమ్మ రిజర్వాయర్, శ్రీరాంసాగర్ ఎత్తిపోత పథకాలతో రుద్రమ్మ రిజర్వాయర్‌తో త్రివేణి సంగమంలా జిల్లాకు సాగునీరందిస్తాం. ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులన్నీ నింపుతాం. యాదాద్రి దేవాలయాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం.
పారిశ్రామిక క్లస్టర్లు పూర్తి చేయించి 40 నుంచి 50వేల మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామిక వేత్తలకు మరింత ఉపాధి పెంచుతాం. జనగామలో మరో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తాం. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 20 సంవత్సరాల్లో చేసిన పని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు అడ్డగించారు. కమీషన్‌ల కోసం బ్రాహ్మణవెల్లంను పూర్తి చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment