
సాక్షి, విజయవాడ : అన్నదాతల ఆపద్బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని(జూలై 8) రైతు దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆనందంగా ఉందని రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభించిన వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరపాలన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటన పట్ల రైతులంతా ఆనందంగా ఉన్నారన్నారు. రైతే దేశానికి వెన్నెముక అని అందరూ చెబుతారు కానీ.. సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. నవరత్నాలను ప్రకటించడమే కాదు అదే ఖురాన్, బైబిల్, భగవద్గీతగా నమ్ముతూ సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. రైతులకు పగటి పూట 9 గంటల కరెంట్, స్థిరీకరణ నిధి, ఇన్సూరెన్స్ వంటికి చేపట్టి రైతులకు భరోసా కల్పిస్తున్న సీఎం జగన్‌కు రైతులను రుణపడి ఉంటారన్నారు. వైఎస్సార్ కోరుకున్నట్లు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు అడుగులేస్తున్న సీఎం జగన్‌కు అందరూ సహకరించాలని కోరారు.