పాడేరు రూరల్: కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పనుపులేటి బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం ఏఐసీసీ, పీసీసీ అధ్యక్షులకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు నేపథ్యంలో టీడీపీపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదనే భావనతోనే ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది.
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న బాలరాజు 1987లో ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి జీకే వీధి మండల పరిషత్ అధ్యక్షుడిగా గెలిచారు. తర్వాత రెండేళ్లకే చింతపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో పాడేరు నుంచి గెలిచి వైఎస్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 30 ఏళ్లుగా ఏజెన్సీలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలరాజు రాజీనామాతో ఇక ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కనుమరుగైందనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment