సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్‌పై అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు ఫైర్ అయ్యారు. ఇటువంటి విషాద ఘటనలను రాజకీయ నిరుద్యోగులు ప్రచారానికి వాడుకోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బోటు ప్రమాదం మృతుల కుటుంబాలకు పండుల రవీంద్ర తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
రెండుసార్లు ఎంపీ అయిన హర్షకుమార్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. చనిపోయిన వారు అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకే లాంచీలో వెళ్లారనడం తప్పు అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో మృతుల కుటుంబాలు మనోవేదనకు గురవుతాయన్నారు. ‘మీపై గౌరవం ఉంది. మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి’ అని హర్షకుమార్‌ను పండుల డిమాండ్ చేశారు. బోటు ప్రమాదం ఘటనను సంచలనాలకు, రాజకీయాలకు వాడకూడదని హితవు పలికారు. బోటు ప్రమాదంపై ప్రభుత్వం చేయాల్సిదంతా చేస్తోందని స్పష్టం చేశారు.
రాజకీయ ఉద్యోగం కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకుని.. హర్షకుమార్ నైతిక విలువలు దిగజార్చుకున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావుపైన పండుల రవీంద్ర మండిపడ్డారు. దళితులపై దాడి చేసిన టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు.. మీకు కళ్లు పోయాయా అని ఆయనను ప్రశ్నించారు. దళితులను చింతమనేని దుర్భాషలాడినప్పుడు మీరు ఏమైపోయారని నిలదీశారు. బుద్ధుడి పేరుతో భూములు ఆక్రమించే గొల్లపల్లి సూర్యారావుకు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment