మోదీ లెక్కల్లో ‘దాచేస్తే దాగని సత్యం’ | Fresh Debate India Old GDP Numbers | Sakshi
Sakshi News home page

మోదీ లెక్కల్లో ‘దాచేస్తే దాగని సత్యం’

Published Thu, Aug 23 2018 5:15 PM | Last Updated on Thu, Aug 23 2018 5:17 PM

Fresh Debate India Old GDP Numbers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిందని, తాము అధికారంలోకి వస్తే ‘అచ్చే దిన్‌’ తీసుకొస్తామంటూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. మన్మోహన్‌ సింగ్‌ హయాంలోని యూపీఏ ప్రభుత్వం కన్నా దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దెబ్బతింటూ వచ్చింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ చట్టం అమలు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయింది. ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగాలేని మోదీ ప్రభుత్వం గత మూడేళ్లుగా కొత్త ఆర్థిక సూత్రాలపై అభివృద్ధి అంకెలను తారుమారు చేసి ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగు పడిందని చూపేందుకు ప్రయత్నిస్తోంది.

2015 నుంచి సవరించిన ఆర్థిక ప్రాతిపదికన మోదీ ప్రభుత్వం జీడీపీ వృద్ధి రేటును లెక్క గడుతున్న విషయం తెల్సిందే. 2004–2005 ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని జీడీపీ రేటును లెక్క గట్టగా 2015లో జీడీపీలో 5 శాతం వృద్ధి రేటును సాధించినట్లు తేలింది. ఈ లెక్కలను ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించపోవడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ 2004–2005 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా 2011–2012 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని జీడీపీ వృద్ధి రేటును తిరిగి లెక్కించింది. అప్పుడు 2015 సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.9 శాతానికి పెరిగింది. ఈ లెక్క కూడా మోదీ ప్రభుత్వానికి సంతృప్తి ఇచ్చినట్లు లేదు.

తాజాగా మరో ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడింది. మోదీ ప్రభుత్వంలోని ‘మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌’ ఆగస్టు 17వ తేదీన కొత్త ఆర్థిక సూత్రాలపై 2015 సంవత్సరం జనవరి నుంచి దేశ ఆర్థిక పురోభివృద్ధి వివరాలను వెల్లడించింది. ఈ తాజా గణాంకాల ప్రకారం 2007లో అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 10.8 శాతం జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటును సాధించింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వం హయాంలో జీడీపీ వృద్ధి రేటు పడిపోతూ వచ్చింది. ఎంత పడిపోయినా సరాసరి వృద్ధి రేటు 8.1 శాతంగా ఉండింది. ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్ల పాలనలో దేశ జీడీపీ సరాసరి వృద్ధి రేటు 7.3 శాతానికి పడిపోయింది. ఈ వృద్ధి రేటు 2017 సంవత్సరంలో 7.1 శాతం ఉండగా, 2018 సంవత్సరానికి 6.7 శాతానికి పడిపోయింది.

ఈ కొత్త లెక్కలను చూసి మోదీ ప్రభుత్వం బెంబేలెత్తి పోయింది. తానొకటనుకుంటే మరోటయిందని బిత్తర పోయింది. ‘అవి అధికారిక లెక్కలు కావు. అవి ప్రయోగాత్మకంగా చూపిన లెక్కలు’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ‘మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌’ వెబ్‌సైట్లో ఆగస్టు 22వ తేదీ వరకున్న ఈ కొత్త గణాంకాలు ఇప్పుడు కనిపించకుండా గల్లంతయ్యాయి. కొత్త లింకుల ద్వారా వాటిని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement