సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ జి.వివేక్ బీజేపీలో చేరడం దాదాపుగా ఖరారైంది. మంగళవారమే ఆయన బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ కానున్నారు. అమిత్‌షా అపాయింట్‌మెంట్ కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. అమిత్‌షాను వివేక్ కలువను న్నది వాస్తవమేనని, ఆయన మంగళవారమే పార్టీలో చేరుతారా? అమిత్‌షాతో చర్చించిన తర్వాత చేరతారా? అన్నది తేలియాలని పార్టీ ఉన్నతస్థాయి వర్గా లు పేర్కొన్నాయి. మెుత్తానికి వివేక్ బీజేపీలో చేరడం ఖరారయినట్లేనని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి.
టీడీపీ టార్గెట్‌గా ముందుకు
తెలంగాణలోని టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకునే ‘టార్గెట్ టీడీపీ’ని బీజేపీ వేగవంతం చేసింది. ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌రెడ్డి తదితర నేతలు బీజేపీ లో చేరారు. ఇక టీడీపీలోని నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. గరికపాటి రామ్మోహన్‌రావు నేతృత్వం లో ఈ ప్రక్రియను బీజేపీ వేగవంతం చేసింది. తొలుత ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన కీలక టీడీపీ నేతలు బీజేపీలో చేరేలా ఏర్పాట్లు చేసింది. దీనిపై గతంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.. టీడీపీకి చెందిన నియోజకవర్గస్థాయి ముఖ్యనేతలతో గరికపాటి నివాసంలో చర్చ లు జరిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఐదుగురు నియోజకవర్గస్థాయి నేతలు మంగళవారం ఢిల్లీలో అమిత్‌షాను కలిసేందుకు వెళ్తున్నారు. అయితే ఆగస్టు 15లోగా అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆయన వచ్చినపుడు పార్టీలో చేరికలు ఉండేలా రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తోంది. మంగళవారం వారంతా బీజేపీలో చేరకపోతే అమిత్‌షా హైదరాబాద్ వచ్చాక నిర్వహించే సభలో టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు పార్టీలో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment