మాట్లాడుతున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
అనంతపురం సెంట్రల్: ‘రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి పేరు చెబితే ఒకప్పుడు ప్రజలందరూ భయపడేటోళ్లు. అలాంటి వ్యక్తికి నారా లోకేష్ వచ్చి ధైర్యం చెబుతుంటే జేసీ దివాకర్‌రెడ్డి ఎంత గతి వచ్చిందని అనుకుంటున్నారు’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. మంగళవారం నగరంలోని మాధవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కొడుకుగా, స్వర్గీయ ఎన్‌టీఆర్ మనవుడిగా, అభిమాన నటుడు బాలకృష్ణ సొంత అల్లుడి హోదాల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తే ప్రజలు చీత్కరించారన్నారు. ఓటర్లను అనేక ప్రలోభాలకు గురి చేసినా ఓటెయ్యని పరిస్థితి నెలకొందన్నారు. అలాంటి వ్యక్తి వచ్చి సుదీర్ఘ అనుభవం ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి ధైర్యం చెబుతుండం చూస్తే నవ్వు వస్తోందన్నారు.
లోకేష్ ఉపన్యాసాలు వింటూ చిన్న పిల్లలు జోక్‌గా నవ్వుకుంటారని... అలాంటి వ్యక్తి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శలు చేయడం, అభ్యంతకర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. రూ. 50 కోట్లు ఎర చూపి అచ్చెన్నాయుడు వైఎస్సార్‌సీపీలోకి రావాల్సిందిగా ప్రలోభపెట్టారని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల తరహాలో కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాల్సిన గత్యంతరం లేదన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి తనకున్న ఆస్తులతో 20 సంవత్సరాలు జిల్లాను పోషించవచ్చని, అలాంటి వ్యక్తులు నేరాలకు పాల్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. 6 వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్ చేయించి 151 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌లు, నకిలీ పోలీసు క్లియరెన్స్‌లతో వాహనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలీడం లేదన్నారు. ఇక్కడ నేరం చేస్తే పట్టుబడతామని నాగలాండ్ రాష్ట్రానికి వెళ్ళారని, స్క్రాప్ కింద వాహనాలను అమ్మినట్లు అశోక్‌లైలాండ్ కంపెనీ రాతపూర్వకంగా తెలియజేసిందన్నారు. జేసీ సోదరులు చేసిన నేరాలు ఆధారాలతో సహా బయటపడటంతోనే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జేసీ సోదరుల చేతిలో మోసపోయి లారీలు కొనుగోలు చేసిన నాగరాజు, జయరంగారెడ్డి తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వివరించారు.
లోకేష్ రాజకీయాలకు పనికి రాడు
గుత్తి: ‘మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ బాబు అసమర్థుడు , రాజకీయాలకు ఏ మాత్రం పనికి రాడు’ అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. గుత్తి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో మంగళవారం ఆయన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నారా లోకేష్ , బాలకృష్ణలపై విరుచుకుపడ్డారు. మామ అల్లుళ్లు నారా లోకేష్, బాలకృçష్ణ మాటలు విని జనాలు నవ్వుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏసీబీ అరెస్టు చేస్తే చంద్రబాబు వెళ్లి పరామర్శించడం, నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో బస్సులు, లారీలు కొని తిప్పినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు పంపితే నారా లోకేష్ తాడిపత్రికి వచ్చి జేసీ కుటుంబాన్ని పరామర్శించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.
పక్కా ఆధారాలతో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి, అచ్చెన్నాయుడులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తే టీడీపీ నేతలు నానా యాగీ చేస్తుండటం సిగ్గు చేటన్నారు. నారా లోకేష్ తాడిపత్రిలో ప్రెస్‌మీట్ పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఏదేదో మాట్లాడుతున్నాడన్నారు. అసలు లోకేష్ రాజకీయాలకు పనికి రాడనీ, హెరిటేజ్‌లో పాలు, కూరగాయలు అమ్ముకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. వరుస అరెస్టులతో టీడీపీ నేతల్లో గుబులు పట్టుకుందని, జేసీ, అచ్చెన్నాయుడుతో అరెస్టులు ఆగవన్నారు. అవినీతిపరులు, అక్రమార్కులు జైలుకు వెళుతూనే ఉంటారన్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దూసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలన్నింటికీ ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. మరో 30 సంవత్సరాలు సీఎంగా వైఎస్ జగన్ కొనసాగుతారని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ పీరా, బీసీ సెల్ జిల్లా నాయకులు శివయ్య, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, ప్రముఖ న్యాయవాది బుసా సుధీర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గురు ప్రసాద్ యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు భీమలింగ, శామ్యూల్, మైనార్టీ జిల్లా నాయకులు జీఎం బాషా, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment