సాక్షి, న్యూఢిల్లీ : నగరంలోని గురుద్వార్ రకబ్‌గంజ్ రోడ్డులోని తన నివాసంలో గత వారం జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు ఏర్పాటు చేసిన విందుకు దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. ప్రఫుల్ పటేల్ ప్రతి ఏడాది శీతాకాలంలో మీడియా ప్రతినిధుల కోసం విందును ఏర్పాటు చేస్తారు. ఈసారి అందుకు భిన్నంగా 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులకు విందు ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, సమాజ్‌వాది పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి సతీష్ మిశ్రా, టీఎంసీ నాయకుడు డెరెక్ ఓబ్రయిన్, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి, డీఎంకే నాయకులు కనిమోళి, రాష్ట్రీయ జనతా దళ్ నుంచి మిసా భారతిలు హాజరయ్యారు. మాజీ రాజకీయ ప్రత్యర్థులైన యాదవ్, మిశ్రాలు ఒకే టేబుల్‌పై కూర్చోవడం విశేషం. రానున్న ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా తామంతా ఒకే వేదికపైకి వస్తున్నామన్న సంకేతానికి చిహ్నంగా వాళ్లంతా విందుకు హాజరయ్యారు. అయితే ఇంతకుముందు భావించినట్లుగా కాంగ్రెస్ నాయకత్వాన మహా కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించడం లేదు.
మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పీ. చిదంబరం, అహ్మద్ పటేల్, గులామ్ నమీ ఆజాద్‌లు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే రాష్ట్రాల వారీగా కూటమిలు ఏర్పాటు చేసుకొని విజయం సాధించిన అనంతరం జాతీయ స్థాయిలో ఒక్క కూటమిగా ఏర్పాటు కావాలని ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా భావిస్తున్నాయి. అందుకనే ఉత్తరప్రదేశ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కోసం అమేథి, రాయ్‌బరేలి నియోజక వర్గాలను వదిలేసి మిగతా అన్ని నియోజక వర్గాల్లో తాము కలసికట్టుగా పోటీ చేస్తున్నామని ఎస్పీ, బీఎస్పీ ప్రకటించాయి.
యూపీలోని 80 సీట్లకుగాను ఎనిమిది సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని ఎస్పీ, బీఎస్పీలు ప్రతిపాదించాయని, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న 21 స్థానాలు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని, అందుకని కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరలేనదని ఆ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎనిమిదయితే ఎనిమిదికే పొత్తు పెట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా దిగి ఎక్కువ సీట్లలో పోటీ చేసినట్లయితే అది బీజేపీకి లాభిస్తుందని వారు వాదిస్తున్నారు. ఎన్నికల చివరి నిమిషం వరకు పొత్తుపై చర్చలు జరుగుతాయన్నది తెల్సిందే.
అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ తణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లకు ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ ప్రకటించారు. 2014లో జరిగిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని బెంగాల్ ప్రదేశ్ కమిటీ కూడా పార్టీ అధిష్టానంను డిమాండ్ చేస్తోంది. పశ్చిమ బెంగల్‌లో 42 లోక్‌సభ స్థానాలున్న విషయం తెల్సిందే. ఈసారి కాంగ్రెస్, వామపక్షాలు వేర్వేరుగా పోటీ చేసినట్లయితే మమతా బెనర్జీ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వల్ల రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీకి లాభం చేకూర్చినట్లు అవుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మమతా బెనర్జీ పిలుపు మేరకు జనవరి 19వ తేదీన కోల్‌కతాలో జరుగనున్న ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకారదని కూడా బెంగాల్ కాంగ్రెస్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఆ ర్యాలీకి రాహుల్‌తోపాటు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను మమతా బెనర్జీ ఆహ్వానించారు. ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకు నిర్వహిస్తున్న ర్యాలీకి రాహుల్ వెళ్లకపోతే ఎలా అన్నది పార్టీ అధిష్టానం వాదన. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
Published Tue, Jan 8 2019 6:55 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment